GDCCB Bank: అసలు బ్యాంక్ ముఖమే చూడనివారి పేరున రూ. లక్షల్లో రుణాలు..!

| Edited By: Balaraju Goud

Jul 30, 2024 | 6:06 PM

అక్రమాలకు ఆ బ్యాంక్ అడ్డగా మారింది. రైతులకు అందించాల్సిన రుణాలను బినామీ పేర్లతో దండుకుంటున్న అడ్డుకునే వారే లేకపోయారు. రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అధికారులు అక్రమాలకు కొమ్ము కాశారు.

GDCCB Bank: అసలు బ్యాంక్ ముఖమే చూడనివారి పేరున రూ. లక్షల్లో రుణాలు..!
Gdccb
Follow us on

అక్రమాలకు ఆ బ్యాంక్ అడ్డగా మారింది. రైతులకు అందించాల్సిన రుణాలను బినామీ పేర్లతో దండుకుంటున్న అడ్డుకునే వారే లేకపోయారు. రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ అధికారులు అక్రమాలకు కొమ్ము కాశారు. అసలు బ్యాంక్ ముఖమే చూడని వారి పేరున కూడా రుణాలు ఉన్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదేళ్ళ కాలంలో వ్యవసాయ ప్రాధమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక పాలనలో నడిపించారు. దీంతో రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కువైపోయింది. ఇష్టమొచ్చిన వారికి ఇష్టమొచ్చినంత రుణాలు ఇచ్చారు. అసలు రైతులకే తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకున్నారు. తాజాగా ఇటువంటి ఘటన ఒకటి బయటపడింది.

వట్టిచెరకూరు మండలం లేమల్లే పాడుకు చెందిన సిద్దార్ధ నల్లపాడు జిడిసిసిబి బ్యాంక్ లో పది లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్లు వారం రోజుల్లోగా రుణం చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయి. దీంతో సిద్దార్ణ ఖంగుతిన్నాడు. తానెప్పుడూ అసలు ఆ బ్యాంకుకే వెళ్లలేదని సన్నిహితులకు చెప్పాడు. ఆ తర్వాత బ్యాంక్ వద్దకు వెళ్లి అధికారులను నిలదీశారు. అయితే సిద్దార్ధ ఆధార్ కార్డును మార్చి అతని పేరు మీద కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి ఉన్నట్లు దానిపై రుణం ఇచ్చినట్లు రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సిద్దార్ధ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు విషయం బయటపడటంతో బ్యాంక్ అధికారులు హుటాహుటిన ఆ రుణం తీసుకున్న వారి వద్ద నుండి డబ్బులు బ్యాంక్ కు జమ చేయించారు. అయితే ఇక్కడ ఇటువంటి అవకతవకలు ఎన్ని జరిగాయో అర్ధం కాకుండా ఉందంటున్నారు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ఒక్క బ్రాంచ్ నుండే 150 మందికి నోటీసులు వెళ్లాయి. చాలామంది తాము రుణం తీసుకోలేదంటూ బ్యాంక్ వస్తున్నట్లు తెలుస్తోంది.

జిడిసిసిబిలో వ్యక్తిగత రుణాలే కాకుండా డ్వాక్రా రుణాల్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. గతంలో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర బ్యాంక్ లో జరిగిన మోసాలపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలను కూడా జిడిసిసిబి నుండి ఇవ్వచ్చని చెప్పడంతో అనేక డ్వాక్రా సంఘాలు తమ రుణాలను జిడిసిసిబి కి మార్చుకున్నాయి. వీటితో పాటు ప్రాధమిక సహకార సంఘాల్లో కూడా బినామీ పేర్లతో రుణాలు పొందినట్లు వాటిపై విచారణ జరిపించాలని అప్పటి టిడిపి నేతలు పెద్ద ఎత్తున ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిడిసిసిబితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై కూడా విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతున్న బ్యాంక్ అధికారులు ఎవరూ ఈ అంశంపై స్పందించేందుకు ముందుకు రావడం లేదు. బ్యాంక్ కొత్త ఛైర్మన్ వచ్చేలోపే గత ప్రభుత్వం హయంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…