ఏపీ మహిళలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఉగాది నుండి పథకం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఆ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా దీనిని అమలు చేయాలని ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి ఏ మార్గాలు అనుసరిస్తే బాగుంటుంది, అనే అంశాలతో నివేదిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
దీంతో ఉచిత బస్సు పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లోని విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. తాజాగా పథకంపై అధ్యయనం కోసం కర్ణాటకలో పర్యటించారు కేబినెట్ సబ్ కమిటీలోని సభ్యులు. ఈ పర్యటనలో భాగంగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిని, కర్ణాటక అధికారులతో సమావేశమై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలుపై చర్చించారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వం ఎంత భారం పడుతోంది..? ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది..? అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సబ్ కమిటీ సభ్యులు కర్నాటక ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉచిత ప్రయాణంలో అక్కడి మహిళా ప్రయాణికులకు కలుగుతున్న సౌకర్యం, లబ్ధి గురించి కర్ణాటక బస్సుల్లో ప్రయాణం చేస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రోజుకు సగటున 10 లక్షల మంది వరకు మహిళా ప్రయాణికులు ఉంటారు. వీరందరికీ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న బస్సులకు అదనంగా మరో 2వేల బస్సులతో పాటుగా 11 వేలకు పైగా సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి