స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఓ వైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ పక్కా ప్లాన్లు వేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పార్టీ వీడుతున్నారు. ఇంతకు ముందే ఎమ్మెల్సీ పదవితో పాటు.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఇప్పుడు పార్టీకే రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు.
గతేడాది జరిగిన ఎన్నికల్లో తాను తాడికొండ సీటును ఆశించానని.. కానీ చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను అక్కడి నుంచి ఓడిపోతానని తెలిసినా.. పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలు వివాదాస్పదం అవుతాయని ఊహించే సభకు హాజరుకాలేదని తెలిపారు.
ఇదిలా ఉంటే.. మరోవైపు కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సైకిల్ దిగేసి.. వైసీపీ కండువా కప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీ శ్రేణులతో కూడా భేటీ అయిన సందర్భంలో.. పార్టీ వీడనున్నట్లు తెలిపినట్లు ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే పార్టీలో చేరమని వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. త్వరలోనే అధినేత జగన్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. దీంతో స్థానిక ఎన్నికల ముందు టీడీపీకి మరో భారీ షాక్ తగలనుంది.