మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)సంచలన నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు సిటీలో ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చన్నారు. రెండున్నరేళ్లుగా ఫ్లెక్సి రహిత నగరంగా నెల్లూరు సిటీని ఉంచగలిగామన్నారు. ఫ్లెక్సీలు కట్టోద్దు అంటే కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు.. ఇకపై ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనా లేవన్నారు. తనకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాలేదన్నారు. ప్రమాణ పూర్తిగా ఇది తన నిర్ణయమే అని పేర్కొన్నారు. అనిల్ గూండాయిజం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారు.. తాను గనుక గూండాయిజం చేస్తే ఫ్లెక్సీలు కట్టిన వారి చేతులు ఉండేవా అంటూ ప్రశ్నించారు. అలాంటివి తాను చేయనన్నారు. నెల్లూరు సిటీలో గతంలో తన ఫ్లెక్సీలు కట్టలేదని.. ఇకపై కట్టేది లేదని తేల్చి చెప్పారు.
అసలేం జరిగిందంటే..
ప్రతిపక్ష నేతలు ఫ్లెక్సీలు సహా అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు సైతం తొలగించడంపై నెల్లూరులో రాజకీయ వర్గపోరు రాజుకుంది. అధికార వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో అభిమానులు, అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. అదే సమయంలో దివంగత నేత ఆనం వివేకానంద రెడ్డి జయంతి పురస్కరించుకుని కూడా నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని కూడా మునిసిపల్ సిబ్బంది తొలగించారు. అయితే ఫ్లెక్సీల తొలగింపుపై ఆయా నేతల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో నెల్లూరు నగర పరిధిలో నేతల ఫ్లెక్సీల తొలగింపుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు.
ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ పిట్ట.. 44 బిలియన్ డాలర్లకు డీల్..
Teething in Babies: మీ పిల్లలకి పళ్ళు వస్తున్నాయా.. అప్పుడు మీరు చేయాల్సిన పనులు ఇవే..