eruvaka pournami: ప్రపంచానికి అన్నం పెట్టే రైతులు.. తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమినుంచే ప్రారంభిస్తారు. ఏరు అంటే నాగలి. వాక అంటే దుక్కి దున్నడం అని పెద్దలు చెబుతారు. తొలకరి పలకరించిన తరవాత, వచ్చే జ్యేష్ఠ పౌర్ణమినాడు రైతులు ఏరువాక జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉభయ రాష్ట్రాల్లో రైతులు ఏరువాకను ఆనందోత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. వర్షాలు విస్తారంగా కురిసి… పంటలు బాగా పండి.. అధిక దిగుబడి ఉండేలా చూడాలని రైతులు పుడమి తల్లిని వేడుకొన్నారు. గుంటూరు(Guntur)లో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఏరువాక పున్నమిని ఘనంగా నిర్వహించారు. ఆయన పొలంలో స్వయంగా అరక కట్టి పొలం దున్నారు. ఏరువాక రోజున తమ ఎద్దులను అలంకరించి, పొలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వ్యవసాయ పనులను రైతులు ప్రారంభిస్తారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ మోదుగుల కూడా తెలుగు దనాన్ని ప్రతిబింబిస్తూ తెల్లటి వస్త్రాలు, తలపాగా ధరించి అచ్చమైన రైతులా పొలం దున్నటం చూసి ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. యాంత్రీకరణ పెరిగి ట్రాక్టర్లు అందుబాటులోకి రావడంతో అన్ని సాంప్రదాయాల్లాగానే ఏరువాక అటకెక్కింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.