గిరిజనుల ఆకలి తీరుస్తున్న సహజ సిద్ధ పంటలు.. పోషకాల నిలయం అడవి ఆకుకూరలు
పచ్చదనంతో నిగనిగలాడే పాలకూర, తోటకూరలు ఇతరత్రా ఆకు కూరలు మాత్రమే తినరు. పేరెప్పుడూ వినని వింతవింత ఆకుకూరలు, గింజలు, ధాన్యం, దుంపల్ని తింటారు. అందరూ తినే ఆహారంతో పోలిస్తే వారు తినేవన్నీ బలవర్దకమైనవి.. మరింత ఆరోగ్యకరమైనవి.. ముఖ్యంగా రక్త ద్వేషాలు హరించే పులిచింతను మన ప్రాంతానికి వచ్చిన వలస గిరిజనులు ఇష్టంగా తింటారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఖాళీగా ఉన్న వలస గిరిజనులు పులిచింత ఆకును సేకరించి ఇష్టంగా స్వీకరిస్తున్నారు.

అక్కడ కోసేసిన వరి పొలాల్లోకి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వలస గిరిజనులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. వరి పంట కోసిన తర్వాత ఆ పొలాల్లో ఏముంటుంది. వీరంతా అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు.. ఏం వెతుకుతున్నారు అనే కదా మీ అనుమానం. వారు ఎంతో పోషక విలువలు గల సహజ సిద్ధంగా దొరికే ఆహారం కోసం అక్కడ వెతుకుతున్నారు.. అంటే మీరు నమ్మగలరా.. ఏంటి అలాంటి విలువైన ఆహారం కోసేసిన వరి పొలాల్లో దొరుకుతుందా అనే అనుమానం కలగవచ్చు. ఈ స్టోరీ చదివితే మీ అనుమానాలన్నీ వెంటనే తీరిపోతాయి..
మన దేశంలో ఒకప్పుడు ఉన్నంత ఆహార కొరత ఇప్పుడు లేదని భావిస్తాం. కానీ మైదాన ప్రాంతాల్లో అది కొంత వరకు నిజమే కావొచ్చు. కానీ, అటవీ, పర్వత, మారుమూల ప్రాంతాల్లో నేటికీ ఆహార కొరత ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో కరువు వచ్చినప్పుడు అడవుల్లో పొలాల్లో సహజంగా దొరికే దుంపలు, పండ్లు, ఆకు కూరగాయలను తింటూ బతుకుతున్నారు గిరిజన, ఆదివాసీలు. అలాంటి వాళ్లల్లో ఛత్తిస్ ఘడ్ నుంచి వలస వచ్చిన కొందరు ఆదివాసీలు. ఇంట్లో సరుకులు లేనప్పుడు, కూలి పనులు దొరకనప్పుడు వారికి ఆరోగ్యకరమైన ఆహారం ప్రకృతే అందిస్తుంది.
సహజంగా పల్లెల్లో పొలాల గట్లపైనా, కొండ దడుల్లో, వంకల దాపుల్లో పెరిగే సాగుచేయని ఆకుకూరలు, అటవీ ప్రాంతాల్లో లభించే దుంపలు తిని గిరిజనులు ఆరోగ్యంగా బతుకుతున్నారు. వీళ్లు పచ్చదనంతో నిగనిగలాడే పాలకూర, తోటకూరలు ఇతరత్రా ఆకు కూరలు మాత్రమే తినరు. పేరెప్పుడూ వినని వింతవింత ఆకుకూరలు, గింజలు, ధాన్యం, దుంపల్ని తింటారు. అందరూ తినే ఆహారంతో పోలిస్తే వారు తినేవన్నీ బలవర్దకమైనవి.. మరింత ఆరోగ్యకరమైనవి.. ముఖ్యంగా రక్త ద్వేషాలు హరించే పులిచింతను మన ప్రాంతానికి వచ్చిన వలస గిరిజనులు ఇష్టంగా తింటారు. ఏలూరు జిల్లా కుక్కునూరు మండల పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ఖాళీగా ఉన్న వలస గిరిజనులు పులిచింత ఆకును సేకరించి ఇష్టంగా స్వీకరిస్తున్నారు. ఏడాది పొడవునా పొలం గట్ల మీద, పొలాల్లో ఈ రకం ఆకు కూర సహజంగా పండుతుంది. ఇప్పటి తరానికి దీని విలువ తెలియక పోవచ్చు కానీ ఆదివాసీలకు ఇదో ప్రధానమైన ఆహారం.
ఎన్నో పోషకాలు కలిగిన పులిచింత ఆకు కూర రక్త దోషాలు హరించే మందుగా పని చేస్తుంది. రక్తస్రావం, తలనొప్పి, దంత సమస్యలు, కడుపు నొప్పి, మంట, అజీర్ణం, నొప్పులు, వాపులు వంటి రోగాలకు ఇది మంచి ఔషదం అని గిరిజనులు నమ్ముతారు. ఈ ఆకు కూరను ఉడికించి తిన్నా, పచ్చిది నమిలి మింగినా బలవర్ధక పోషకాలు అందుతాయని గిరిజనులు చెబుతున్నారు. ఒక పులిచింత వంటి ఆకు కూర మాత్రమే కాదు అడవుల్లో.. పొలం గట్ల మీద తెలియని పంటలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఆదివాసీలకు తెలుసు. ఇవి వారి రోజువారి ఆహారంలో భాగం కూడా.
గ్లోబల్‌వార్మింగ్, వాతావరణ అసమతుల్యం, ప్రకృతి విధ్వంసం, చెట్ల నరికివేత.. వంటి కారణాలతో అటవీ వైవిధ్యం దెబ్బతింటోంది. మరోవైపు వ్యవసాయంలో ఆశించిన స్థాయిలో లాభాలు గడించకపోవడం, క్రిమి సంహారక మందుల వాడకం ఎక్కువైంది. దీని వల్ల సహజ పంటలు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడింది. పూర్వం ప్రత్యేకంగా సాగు చేయాల్సిన పని లేకుండా వందల రకాల సహజ పంటలు ప్రకృతిలో లభించేవి. ప్రస్తుతం ఇలాంటి ప్రకృతి ఆధారిత పంటల్లో కొన్నే లభిస్తున్నాయి. మన చుట్టూ పనికొచ్చే మొక్కలే చాలా ఉంటాయి. వాటిని గుర్తించి, వాడుకుంటే ఎంతో మంచిది. పొలాల్లోనే కాదు, ఖాళీ ప్రదేశాల్లో, పెరటితోటల్లో సాగు చేయని ఆకుకూర మొక్కలు చాలానే ఉంటాయి. వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, పీకి పారెయ్యడమో లేక కలుపు మందులు చల్లి నాశనం చెయ్యడమో చేస్తున్నారు. కళ్ల ముందున్న సమృద్ధి పోషకాహారాన్ని తినకుండా.. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ విలువైన ఆకుకూరల్ని గుర్తించి ఆహారంగా తీసుకుంటే మేలు జరుగుతుందని పలువురు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




