Anantapur Floods: వరద పోయింది.. బురద మిగిలింది.. అనంతపురం నగరవాసుల దీన స్థితి..

|

Oct 14, 2022 | 12:51 PM

నిన్నటి వరకు వరద నీటిలో ఉన్న కాలనీల పరిస్థితి దారుణంగా తయారైంది. సహాయ శిబిరాల్లో రెండు రోజుల పాటు తలదాచుకున్న.. ముంపు బాధితులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ధ్వంసమైన ఇళ్లు, పాడైపోయిన సామాన్లు.. బురదతో..

Anantapur Floods: వరద పోయింది.. బురద మిగిలింది.. అనంతపురం నగరవాసుల దీన స్థితి..
Anantapur Floods
Follow us on

అనంతపురం నగరంపై మూడు రోజులుగా పగ పట్టిన వరద శాంతించింది. నిన్నటి వరకు కాలనీలకు కాలనీలను ముంచేసిన వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. అయితే నిన్నటి వరకు వరద నీటిలో ఉన్న కాలనీల పరిస్థితి దారుణంగా తయారైంది. సహాయ శిబిరాల్లో రెండు రోజుల పాటు తలదాచుకున్న.. ముంపు బాధితులు తిరిగి ఇంటికి వచ్చే సరికి ధ్వంసమైన ఇళ్లు, పాడైపోయిన సామాన్లు.. బురదతో నిండిన కాలనీలు స్వాగతం పలుకుతున్నాయి. ఇళ్లలో ఉన్న బురదను, మురుగునీటిని అతి కష్టం మీద తోడేసుకుంటున్నారు. ఇళ్లలో తీవ్రమైన దుర్వాసన వస్తోంది. ఇళ్లలోని వస్తువులు, నిత్యావసరాలు, దుస్తులతో సహా మొత్తం తడిచిపోయాయి. కాలనీలకు విద్యుత్ సరఫరా కూడా లేదు.

వరదతో చాలా నష్టపోయామని.. బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రెండు రోజులుగా తాము నీటిలోనే బిక్కు బిక్కుమంటూ గడిపామని బాధితులు వాపోయారు. వంకల చుట్టూ ప్రొటెక్షన్ వాల్ కట్టి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు. ఇప్పటికైనా వరద రాకుండా శాశ్వత పరిష్కారం చూపించాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఒకటీ రెండు కాదు ఏకంగా 18 కాలనీలు నీటమునిగాయంటే సిట్యువేషన్ ఎంత ప్రమాదకరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఇక్కడి బుక్కరాయ సముద్రం చెరువు దగ్గర పొంగిపొర్లుతున్న వంక ప్రవాహంలో ఒక లారీ కొట్టుకుపోయిందంటే.. పరిస్థితి ఎంత జలమయంగా ఉందో తెలుసుకోవచ్చు.. ఇప్పుడు అక్కడి వరద నీరు వెళ్లిపోయి.. బురద మాత్రం మిగిలింది.

ఈ పరిస్థితి ఎలా వచ్చిందంటే.. రెండు మూడు రోజులుగా అనంతపురం పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు.. చుట్టుపక్కల చెరువులన్నీ నిండిపోయాయి. దీంతో చిన్నా చితకా వాహనాలను నిలిపివేశారు. కేవలం భారీ వాహనాలకు మాత్రమే అనుమతులివ్వగా.. ఆ లారీలు కూడా ఇలా కొట్టుకుపోయాయంటే.. ఇక సాధారణ జనజీవనం ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

మరిన్ని ఏపీ న్యూస్ కోసం