Flash flood to Prakasam Barrage: ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి రావడంతో.. పులిచింత ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న క్రమంలో గేట్లు తెరుస్తుండగా.. ఊహించని ఘటన జరిగింది. ఈ క్రమంలో గేట్లు ఎత్తేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా.. 16వ నంబర్ గేటు ఊడిపోయింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి నీరు వృధాగా వెళ్తోంది. 1,65,763 క్యూసెక్కుల మేర నీరు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో గరిష్ఠస్థాయిలో నీరు నిల్వ ఉంది. నీరు ఎక్కువగా ఉండటంతో కొత్త గేటు అమర్చడం సాధ్యంకాదని తెలిపారు.
16వ గేట్ విరిగిపోవడంతో 15, 17 గేట్ల ద్వారా కూడా నీరు లీకవుతోంది. దీంతో ప్రాజెక్ట్‌పై ఒత్తిడి తగ్గించేందుకు మరో 6గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అత్యవసర గేటును ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు డ్యామ్ మీదకు ఎవరూ వెళ్లకుండ చర్యలు తీసుకుంటున్నారు. అయితే, దానికి ప్రత్యామ్నాయంగా స్టాప్‌లాక్ పరిజ్ఞానంతో తాత్కాలికంగా నీటిని అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను.. పులిచింతల ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అదేశించారు మంత్రి అనిల్ కుమార్.
ప్రాజెక్ట్‌లో సాంకేతిక సమస్య తొలగిపోయినట్టు తెలిపారు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు. తొలగిన స్థానంలో లాక్ గేట్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుందని అధికారులు సూచిస్తున్నారు. పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువన ఉన్న జడపల్లితండా వాసులు ఆందోళన చెందుతున్నారు. తీరగ్రామాలు కొట్టుకుపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లూ, పొలాలు నాశనమై పోతున్నాయని వాపోతున్నారు. ఇటు విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరదముప్పు పొంచి ఉంది. దీంతో డ్యామ్‌లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నదీపరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్ హెచ్చరికలు జారీ చేశారు. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్.
Read Also…. CM Jagan: ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యం.. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన సీఎం జగన్