
అది ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు.. మత్స్యకారులు సమీపంలోని జలాశయంలోకి చేపల వేట చేస్తారు. రోజూ అలా వెళ్లి.. చిక్కిన చేపలు పట్టుకొని వచ్చి.. వాటిని పొట్ట పోసుకుంటూ ఉంటారు. రోజు మాదిరిగానే చేపల వేటకు వెళ్లిన ఆ జాలర్లకు ఊహించని అనుభవం ఎదురైంది. వల వేసేసరికి బరువెక్కింది.. లాగి చూస్తే.. ఎగిరి గంతేసే పరిస్థితి.
వివరాల్లోకి వెళితే.. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం సీలేరు గుంటవాడ జలాశయంలో ఒరిస్సాకు చెందిన మత్స్యకారులు చేపల వేట సాగిస్తూ ఉంటారు. కొందుగూడ గ్రామానికి చెందిన మత్స్యకారులు జలాశయంలో ప్రతిరోజు చేపల వేట కు వెళ్తారు. జలాశయంలో లభించే చేపలే వాళ్ల జీవనోపాధి. తాజాగా చేపల వేటకు వెళ్లిన ఆ మత్స్యకారుల పంట పండింది. వల విసిరి లాగేసరికి.. బరువెక్కింది. నెమ్మదిగా పైకి లాగేసరికి.. భారీ చేప కనిపించింది. ఆ చేప బరువు ఎంతో తెలుసా..? ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 22 కిలోలు. అతి కష్టం మీద ఆ చేపను పడవపైకి ఎక్కించారు. పట్టలేనంత ఆనందంతో ఎగిరి గంతేసారు ఆ మత్స్యకారులు.
ఈ చేపను స్థానికులు దోబిగా పిలుస్తారట. ఒడ్డుకు చేపను తీసుకురావడంతో చాపనుకునేందుకు పోటీపడ్డారు. సీలేరులో నక్క జ్ఞానేశ్వర్ రావ్ అనే వ్యక్తి నాలుగువేల రూపాయలకు ఆ చేప కొనుగోలు చేశాడు. 22 కేజీల చేప కొనుగోలు చేశారని తెలియడంతో స్థానికులు ఆ చేపను చూసేందుకు ఎగబడ్డారు. అక్కడకు వెళ్లి ఫోటోలు సెల్ఫీలు తీసుకున్నారు. ఆ చేప ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.