Palnadu: చేపలు పట్టేందుకు అడవి గుండా నది వద్దకు వెళ్లిన దంపతులు.. తిరిగి వద్దామనుకుంటే..

జీవనోపాధి కోసం ఊరు కానీ ఊరు వచ్చారు. చేపల వేట కోసం నదిలోకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తప్పిపోయారు. రాత్రంతా కూడునీరు లేకుండా క్రూర జంతువుల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎట్టకేలకు పోలీసుల సాయంతో క్షేమంగా అడవి నుండి బయటపడ్డారు. వివరాలు ఇలా....

Palnadu: చేపలు పట్టేందుకు అడవి గుండా నది వద్దకు వెళ్లిన దంపతులు.. తిరిగి వద్దామనుకుంటే..
Forest

Edited By:

Updated on: May 05, 2025 | 2:08 PM

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కొడమంచలి శ్రీను, ధనలక్ష్మి దంపతులు చేపలు పట్టడం ద్వారా జీవనోపాధి పొందుతున్నారు.  కృష్ణా నది సమీప ప్రాంతాలలో చేపల వేట నిమిత్తం ఏప్రిల్ 19న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం  జెండా పెంట గ్రామం వచ్చారు. ఇక్కడ కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్తున్నారు. అయితే వెల్దుర్తి మండలంలో కృష్ణా నది చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం ఉంటుంది. నదిలో వేట కొనసాగిన తర్వాత అటమీ ప్రాంతం గుండానే ప్రయాణించి సమీప గ్రామాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ అటవీ ప్రాంతం గురించి పూర్తిగా తెలిసిన వారు మాత్రమే వేట వెళ్లి తిరిగి ఆయా గ్రామాలకు చేరుకోగలరు. మే 2న తేదిన వేటకు వెళ్లిన దంపతులు తిరిగి గ్రామానికి చేరుకునే క్రమంలో దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయారు. చీకటి పడుతున్నా గ్రామం చేరుకోలేకపోయిన దంపతులు అడవిలోనే బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపారు. ఆహారం కూడా లేకపోవడంతో నీరసించిపోయారు. అయితే తెల్లవారిన తర్వాత ఎట్టకేలకు 100కు డయల్ చేశారు.

దీంతో మాచర్ల రూరల్ సిఐ నఫీస్ బాషా ఆదేశాలతో వెల్దుర్తి ఎస్సై సమందర్ వలి ఫోన్ లోకేషన్ ద్వారా దంపతులు ఎక్కుడున్నారో తెలుసుకున్నారు. కొత్తపుల్లారెడ్డి గూడెం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెల్దుర్తి SI షేక్ సమందర్ వలి, ముగ్గురు కానిస్టేబుళ్లతో కలిసి పోలీస్ స్టేషన్ నుండి 15 కి.మీ ప్రయాణించి, అడవి లోపల మరో 6 కి.మీ నడిచి దంపతులను చేరుకున్నారు. ఆ జంటను గుర్తించి సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే రాత్రంతా భయందోళనల మధ్య అడవిలో గడిపినట్లు ధనలక్ష్మి చెప్పింది. క్రూర జంతవులు అరుపులు కూడా వినిపించాయని వివరించింది. ఎట్టకేలకు పోలీసుల సాయంతో బయటపడటం సంతోషంగా ఉందని దంపతులు తెలిపారు. కాగా ధనలక్ష్మి 4 నెలల గర్భవతిగా తెలిసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..