“గులియన్ బారే సిండ్రోమ్..” ఇంతవరకూ తెలుగు రాష్ట్రాలకు పరిచయమే లేని ఈ పేరు.. ఇప్పుడు వణికిస్తోంది. ఇప్పుటికే తెలంగాణలో ఒకరిని బలి తీసుకున్న ఈ వ్యాధి..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ టెన్షన్ పుట్టిస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు..అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలేంటి ఈ “గులియన్ బారే సిండ్రోమ్” ? కరోనాలా ఇది కూడా అంటు వ్యాధా..? వైద్యులు ఏమంటున్నారు..? తెలుసుకుందాం..!
ఇప్పటికే బర్డ్‌ఫ్లూతో టెన్షన్ పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మరింత భయపెడుతోంది గులియన్ బారే సిండ్రోమ్ మరో మాయదారి రోగం. ఇప్పటికే మహారాష్ట్ర, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కలవరం పుట్టిస్తున్న ఈ జీబీఎస్.. ఇటీవల తెలంగాణకు ఎంటర్ అయింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన 25 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యాధి ఏపీలో కూడా ప్రవేశించింది. ఏపీలో ప్రస్తుతం 17 గులియన్ బర్రె సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు నమోదు అయ్యినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున నమోదు కాగా, కాకినాడలో 4, గుంటూరు, విశాఖలలో 5 చొప్పున జీబీఎస్ కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లా GGHకు గులియన్ బారే సిండ్రోమ్ బాధితులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు బాధితులకు చికిత్స కొనసాగుతోంది. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జిల్లాలో నాలుగు రోజుల్లోనే ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోందని జీజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. అయితే ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయినట్టు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని వైద్యాధికారులు సూచించారు. నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదవడంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అయితే దీనిపై ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు..హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు. గుంటూరు GGHకు వెళ్లిన కృష్ణబాబు.. న్యూరాలజీ వార్డును పరిశీలించారు. చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు..కృష్ణబాబు.
ఈ వైరస్ పేరు గులియన్ బారే సిండ్రోమ్. దీని బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు.
వ్యాధి సోకిన తొలి దశలోనే ఆస్పత్రిలో చేరితే.. 4 వారాల్లో కోలుకునే ఛాన్స్ ఉంటుంది. వ్యాధి ముదిరితే.. కోలుకోవడానికి దాదాపు 6 నెలలు పట్టొచ్చు. అత్యధిక శాతం మందిలో ఇన్‌ఫెక్షన్ మొదలైన ఒకటి రెండు వారాల తర్వాతే ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్‌ఫ్లూయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా గులియన్ బారే సిండ్రోమ్‌కు కారణం కావొచ్చు. అయితే, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని..కరోనాలా ఇది అంటువ్యాధి కాదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సతో నయం చేయవచ్చని భరోసా ఇస్తున్నారు.
రోగనిరోధక శక్తిని నశింపచేసేలా జీబీఎస్ సిండ్రోమ్ విస్తరిస్తోందంటున్నారు వైద్యులు. అతిగా ఇన్ఫెక్షన్లు, వాక్సిన్‌లు, సర్జరీలు, ట్రామా, జన్యుపరంగానూ జీబీఎస్ వ్యాధి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సను అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 8 వేల వ్యాక్సీన్లను అందుబాటులో ఉంచినట్టు తెలిపిన వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
మరోవైపు దేశవ్యాప్తంగా గుల్లెయిన్-బారే సిండ్రోమ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మరో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో GBS సంఖ్య 205 కి చేరుకుందని ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ధృవీకరించిన కేసుల సంఖ్య 177, అందులో 20 మంది రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొంతున్నారు. గుల్లెయిన్-బారే సిండ్రోమ్ కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 9కి చేరుకుంది. మహారాష్ట్రలో ఈ అరుదైన వ్యాధికి సంబంధించిన కేసులు ఎక్కువగా పూణే నుండి వచ్చాయి. అయితే, దేశ ఆర్థిక రాజధానిలో కొన్ని కేసులను గుర్తించారు. ముంబై ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి కూడా GBS తో మరణించాడు. ఇది నగరంలో నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం.
గిలియన్-బార్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
గిలియన్-బార్ సిండ్రోమ్ అనేది అరుదైన కానీ తీవ్రమైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్, దీనిలో శరీర రోగనిరోధక శక్తి పొరపాటున నరాలపై దాడి చేస్తుంది. ఇది కండరాల బలహీనత, తిమ్మిరి, కొన్నిసార్లు పూర్తి పక్షవాతానికి కారణమవుతుంది.
గిలియన్-బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలుః
ఈ వ్యాధి యొక్క లక్షణాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. కాలక్రమేణా తీవ్రంగా మారవచ్చు. దీని ప్రధాన లక్షణాలు:-
1. చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి.
ఇది మొదట పాదాలు, చేతుల్లో తిమ్మిరి అనుభూతి చెందుతుంది. క్రమంగా మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది.
2. కండరాల బలహీనత:
బలహీనత మొదట కాళ్ళలో సత్తువ కోల్పోతాయి. తరువాత అది పైకి కదలవచ్చు, దీనివల్ల నిలబడటానికి మరియు నడవడానికి ఇబ్బంది కలుగుతుంది.
3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస కండరాలు ప్రభావితమవుతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి వెంటిలేటర్ అవసరం కావచ్చు.
4. వేగవంతమైన హృదయ స్పందన, రక్తపోటు
ఇది స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు, హృదయ స్పందనలో క్రమరాహిత్యాలు ఏర్పడతాయి.
5. ముఖం, కంటి కండరాలపై ప్రభావం:
కొన్ని సందర్భాల్లో, ముఖ నరాలు ప్రభావితమవుతాయి. మాట్లాడటం, నమలడం,చూడటంలో సమస్యలు వస్తాయి.
మీరు జాగ్రత్తలు తీసుకోండి:
పైన పేర్కొన్న లక్షణాలను మీరు ఎదుర్కొంటుంటే, ముఖ్యంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ లేదా డెంగ్యూ వంటి అనారోగ్యం తర్వాత, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన చికిత్స ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు.
(ఈ వార్త చదివినందుకు ధన్యవాదాలు. ఈ వార్త మీకు సమాచారం కోసమే. మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే ముందు ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోండి.)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..