వైసీపీ ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలి? ప్రజల్లోకి వెళ్లడానికి ఎలాంటి కార్యాచరణ ఉండాలి? రెండు పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలి? ఇవే అంశాలపై చర్చించేందుకు తెలుగు దేశం – జనసేన ఉమ్మడి సమావేశం జరగబోతుంది. ప్రజా క్షేత్రంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై అక్టోబర్ 23న జరిగే మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
తెలుగు దేశం పార్టీ – జనసేన మొదటి ఉమ్మడి సమావేశం అక్టోబర్ 23న రాజమండ్రిలో జరగనుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైన తర్వాత ఉమ్మడిగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఒక జేఏసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీని ప్రకారం రెండు పార్టీల నుంచి ఐదుగురు సభ్యుల చొప్పున కమిటీలు నియమించారు. రెండు కమిటీలు కలిసి ఉమ్మడి జేఏసీగా ఏర్పాటు కానున్నాయి. ఈ జేఏసీ మొదటి సమావేశం అక్టోబర్ 23న మద్యాహ్నం రెండు గంటలకు రాజమండ్రిలో జరగనుంది.
మొదటి సమావేశం కావడంతో టీడీపీ నుంచి నారా లోకేష్, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతున్నారు. రాబోయే రోజుల్లో అధికార వైసీపీపై ఉమ్మడిగా పోరాటం ఎలా చేయలనే దానిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా ఉద్యమం చేయడంపై ఒక షెడ్యూల్ కూడా విడుదల చేస్తారని సమాచారం. ఎవరికి వారు పార్టీ తరపున కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే.. అలాగే కలిసి చేయాల్సిన కార్యక్రమాల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు. పొత్తుల ప్రకటన తర్వాత ఆయా పార్టీల నేతలు, కేడర్‌కు ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారు. రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని.. కలిసి ముందుకు సాగాలని సూచించారు.
ఉమ్మడి సమావేశానికి ముందుగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా జనసేనతో కలిసి వెళ్ళడంపై చర్చ జరిగింది. జనసేన – టీడీపీ కలిస్తే దాదాపు 160 సీట్లు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అయితే రెండు పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు లోకేష్.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండురోజులు పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరంపై వివరించారు. టీడీపీతో కలిసి ముందుకెళ్లడం ద్వారా వైసీపీని గద్దె దించవచ్చని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. మొత్తానికి అక్టోబర్ 23న జరిగే మొదటి జేఏసీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకునేలా రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…