AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Proddatur: ‘లక్కీ’ అలియాస్ ‘టమాటా’.. ఆస్పత్రిలో ఏందీ గలాటా..

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బందితో సంబంధం లేని వ్యక్తి గత ఐదు నెలలుగా నర్సుగా వ్యవహరించినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పేషెంట్లకు ఇంజక్షన్లు ఇవ్వడం, ఆసుపత్రిలో రీల్స్ చిత్రీకరించడం వంటి ఆరోపణల నేపథ్యంలో అధికారులు మెమోలు జారీ చేయగా, నకిలీ నర్సుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Proddatur: 'లక్కీ' అలియాస్ 'టమాటా'.. ఆస్పత్రిలో ఏందీ గలాటా..
Lucky
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Jul 04, 2026 | 12:59 PM

Share

కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో భద్రతా, పర్యవేక్షణ లోపాలను తేటతెల్లం చేస్తూ ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బందితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి గత ఐదు నెలలుగా నర్సుగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘లక్కీ’ అలియాస్ ‘టమాటాగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆసుపత్రికి తరచూ వచ్చి నర్సు, డాక్టర్ మాదిరిగా వ్యవహరించడంతో పాటు, పేషెంట్లకు ఇంజక్షన్లు ఇచ్చినట్లు, ఆసుపత్రి ఆవరణలో రీల్స్ కూడా చిత్రీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇంతకాలం అతడిని ఆసుపత్రి అధికారులు, సిబ్బంది గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు భావిస్తున్న కొంతమంది నర్సులు, సిబ్బందికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే నకిలీ నర్సుగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకోవాలని ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అయితే, ఆసుపత్రిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి వైద్య సిబ్బందిలా వ్యవహరించిన వ్యక్తి కారణంగా రోగులకు ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఒకవేళ నష్టం జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరిది? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు.

బయటి వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలల తరబడి స్వేచ్ఛగా సంచరిస్తూ, నర్సు లేదా డాక్టర్ మాదిరిగా వ్యవహరించినట్లు ఆరోపణలు రావడం ఆసుపత్రి భద్రతా వ్యవస్థ, పర్యవేక్షణపై తీవ్ర సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అలాగే బాధ్యులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us