
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీని 10రోజులపాటు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వంశీ సహా ముగ్గురిని కస్టడీకి కోరారు పోలీసులు. మరోవైపు వంశీ తరపు లాయర్లు వేసిన బెయిల్ పిటిషన్‌పైనా విచారణ చేపట్టిన కోర్టు… తీర్పును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇటు కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీ కనస్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్‌లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వంశీ. అయితే, పోలీసుల అదుపులో ఉన్న సత్యవర్ధనే ఎవరు దాడి చేశారు..? ఎక్కడ దాడి చేశాడు..? అనేది చెబుతాడని అని అఫిడవిట్ లో పేర్కొన్నారు.
వంశీ కేసులో ఇటు పొలిటికల్ మంటలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. వంశీ, సత్యవర్ధన్ ఎపిసోడ్‌లో పోటాపోటీగా వీడియోలు రిలీజ్ చేస్తూ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేశారు కాబట్టే వంశీ అరెస్టయ్యారు… దీనికి పక్కా అధారాలు కూడా ఉన్నాయంటూ నిన్న సీసీటీవీ ఫుటేజ్‌ని విడుదల చేసింది టీడీపీ. ఓ లిఫ్ట్‌లో వంశీ, సత్యవర్ధన్ వెళ్తున్న వీడియోను బయటపెట్టింది. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని ప్రశ్నించింది. ఇక టీడీపీ వాళ్లు వీడియో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే కౌంటర్ ఎటాక్‌గా వైసీపీ కూడా ఓ వీడియోను విడుదల చేసింది. సత్యవర్ధన్‌ను పోలీసులే బలవంతంగా లాక్కెళ్తున్నారంటూ వీడియోను రిలీజ్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేసింది. వంశీపై కేసు కేవలం రాజకీయ కక్షలోభాగమేనంటోంది. మరి మా వీడియోకు మీ సమాధానం ఏంటంటూ టీడీపీని ప్రశ్నిస్తోంది. మొత్తంగా.. ఓవైపు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టులో వాదనలు.. మరోవైపు పోటాపోటీగా వీడియోలు విడుదల చేస్తూ ఇరువర్గాల మాటల తూటాలు.. దీంతో వంశీ కేసు ఆసక్తికరంగా మారుతోంది. నెక్ట్స్ ఏంటన్న ఉత్కంఠ పెంచుతోంది. మరి కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తోందో.! చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి