
భార్య పై అలిగినా, మద్యం MRP రేట్‌కు దొరక్కపోయినా, పిల్లలకు విద్యాది వెన డబ్బులు పడకపోయినా.. ఇలా ఏ డిమాండ్ నెరవేరకపోయినా సమస్య హైలెట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరికి కనిపించే ఏకైక మార్గం సెల్‌టవర్ ఎక్కడం. తాజాగా ఇలాంటి ఘటనే ఏలూరు జిల్లాలో వెలుగు చూసింది. తమ గ్రామంలో ఎన్నికలు పెట్టట్లేదని ఏలూరు జిల్లాకు చెందిన ఒక జనసేన నేతకు కోపం వచ్చింది. తమగ్రామంలో ఎందుకు ఎన్నికలు పెట్టరు.. ఏ మేము పోటీ చేయవద్దా, మాఊరిని బాగుచేసుకోవద్దా అని కొన్ని రోజులుగా మదన పడుతున్న ఒక నేత ఊరికి ఎన్నికలు పెడతారా లేదా అంటూ సెల్ టవర్ ఎక్కేసాడు. ఈ ఘటన కొయ్యల గూడెం మండలం గవరవరంలో జరిగింది .
వివరాల్లోకి వెళ్తే.. గవరవరం పంచాయతీని గత పంచాయతీ ఎన్నికలకు ముందు గవరవరం, చొప్పరామన్నగూడెం గ్రామాలుగా విడదీశారు. దీనిపై కొందరు న్యాయ స్థానాన్ని ఆశ్రయించటంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగటం లేదు.త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగుతాయని ప్రచారం జరుగుతుండటంతో ఈ సారైనా మాకు ఎన్నికలు పెట్టమంటూ గ్రామానికి చెందిన జనసేన నేత బాబురావు సెల్ టవర్ ఎక్కాడు. కేసును ఉపసంహరించు కోవాలని కోరాడు. రెండు పర్యాయాలుగా ఎన్నికలు జరగకపోవటంతో ప్రజాప్రతినిధిగా ఎన్నిక అవుదామనుకున్న ఆయన కల నెరవేరటంలేదు. సుమారు 3 గంటలపాటు టవర్ పైనే నిలబడ్డాడు.
ఇక గ్రామస్తులంతా కలసి బాబురావుకు నచ్చజెప్పి ఎట్ట కేలకు కిందకు దింపారు. ఊరుకోసం ఉడుం పట్టు పట్టడం మంచిదే కానీ దానికోసం ప్రాణాలు మీదకు తెచ్చుకోవటం ఏంటని బాబురావును పలువురు మందలించారు. ఐతే ఎన్నికలు జరిగితే పోటీ చేయాలనుకుంటున్న బాబురావును మరి ఈ ఘటన తరువాత ఊరివాళ్ళు గెలిపిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి. ఓట్లు పడకపోతే మల్లి టవర్ ఎక్కితే ఎట్టా.. గవరవరానికి పెద్ద సమస్యే వచ్చిందని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.