AP violence: రాష్ట్రంలో హింసపై ఈసీ సీరియస్.. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌

|

May 16, 2024 | 9:53 PM

ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం రాష్ట్ర సీఎస్, డీజీపీల నుంచి వివరణ అందుకున్న ఈసీ... పోలింగ్ రోజు, అనంతర హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది.

AP violence: రాష్ట్రంలో హింసపై ఈసీ సీరియస్.. పల్నాడు, అనంతపురం ఎస్పీల సస్పెన్షన్‌
Andhra Violence
Follow us on

ఏపీ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సీఈసీ తీవ్రంగా రియాక్ట్ అయింది. డీజీపీ హరీష్ గుప్తా, సీఎస్‌ జవహర్‌రెడ్డిల వివరణ అనంతరం.. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్‌ పోలీస్‌ ఆఫీసర్లను సస్పెండ్ చేసిన ఈసీ.. వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా ఘర్షనలు చెలరేగాయని.. వాటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు భావిస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది.

ఈ అంశంపై విచారణ జరిపి ఒక్కో కేసుకు సంబంధించి రెండు రోజుల్లోగా కమిషన్‌కు యాక్షన్ టేక్ రిపోర్టును సమర్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులుపెట్టాలని ఆదేశించింది. ఫలితాల ప్రకటన తర్వాత కూడా హింసను నియంత్రించడానికి 25 CAPF కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌లో 15 రోజుల పాటు కొనసాగించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కమిషన్ నిర్ణయించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..