Prakasam District: మోసగాళ్లకు మోసగాళ్లు… బంగారం వ్యాపారులకే బొమ్మ చూపించారు కదరా..

తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడట... అచ్చం అలాగే ఉంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తుంటే... చీరాలలో ఓ బంగారు నగల వ్యాపారి తూకం ఎక్కువ, బంగారం తక్కువ ఇచ్చి వినియోగదారుల్ని మోసం చేస్తే... త్రిపురాంతకం, దొనకొండ ప్రాంతాల్లో నకిలీ బంగారం కుదువ పెట్టి లక్షల్లో మోసం చేసి పారిపోయారు ఇద్దరు ఘరానా మోసగాళ్లు.  దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు బంగారం వ్యాపారులు.. దీన్నే చెడపకురా, చెడేవు అంటారు మరి.

Prakasam District: మోసగాళ్లకు మోసగాళ్లు... బంగారం వ్యాపారులకే బొమ్మ చూపించారు కదరా..
Cheaters

Edited By:

Updated on: Nov 27, 2025 | 8:02 PM

నకిలీ బంగారంతో గోల్డ్ షాపు యజమానిని మోసం చేసిన ఘటనలు ప్రకాశం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఈ రెండు ఘటనల్లో మోసం చేసిన వ్యక్తులు వారే కావడం గమనార్హం. త్రిపురాంతకంలోని శ్రీ వాసవి జ్యూయలర్ షాపుకు ఇద్దరు కేటుగాళ్లు వచ్చారు. వీరిలో ఒకడు తమది ఇదే మండలంలోని వెల్లంపల్లి అని, తన పేరు కందుల శ్రీధర్ రెడ్డి అని షాపు యజమాని మధుసూదనరావుతో పరిచయం చేసుకున్నాడు. తమకు డబ్బులు అత్యవసరమని బంగారు బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వమని కోరాడు. బంగారం షాపు యజమాని 28 గ్రాముల బ్రాస్‌లెట్‌ను తాకట్టు పెట్టుకొని 1.50 లక్షలు ఆ ఇద్దరికి ఇచ్చాడు. దీంతో వారు ఆ డబ్బులను నింపాదిగా లెక్క పెట్టుకుని మరీ అక్కడ నుండి వెళ్లిపోయారు. వారు వెళ్లాక.. ఆ వ్యాపారి తాను తాకట్టు పెట్టుకున్న బంగారు బ్రాస్‌లెట్ పరీక్షించగా కళ్లు బైర్లు కమ్మాయి. ఆ బ్రాస్లెట్‌ నకిలీదని తేలడంతో వ్యాపారి కంగుతిన్నాడు. వెంటనే వెల్లంపల్లి గ్రామంలో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి ఈ ఇద్దరి గురించి వాకబు చేశాడు. అలాంటి వారు ఎవరూ గ్రామంలో లేరని చెప్పడంతో తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించాడు. దీంతో మోస పోయానని గ్రహించిన వ్యాపారి మధుసూదనరావు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన మోసం పై ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు ఈ జోడీ కేడీగాళ్లు దొనకొండలోని ఎంఎం జ్యూయలర్స్ షాపులో ఇదేవిధంగా బ్రాస్‌లెట్ తాకట్టు పెట్టి అక్కడ కూడా 1.50 లక్షలు తీసుకున్నారు. బ్రాస్‌లెట్‌ను పరిశీలించేందుకు నగల వ్యాపారి లోపలకి వెళ్లిన సమయంలో అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. బ్రాస్‌లెట్‌ నకిలీది కావడంతో వెంటనే హడావిడిగా షాపులోకి వచ్చిన యజమానికి ఆ ఇద్దరు కేటుగాళ్లు కనిపించలేదు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు ఘటనల్లో బంగారం వ్యాపారులను మోసం చేసిన వాళ్లు ఇద్దరూ ఒక బ్యాచ్‌కు చెందిన మోసగాళ్లుగా గుర్తించారు… రెండు ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరా పుటేజ్‌లో ఇద్దరి కదలికలను పోలీసులు గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

రెండు రోజుల క్రితం తూకంలో మోసం చేసి చిక్కిన బంగారం వ్యాపారి…

చీరాల నెహ్రు కూరగాయల మార్కెట్ సమీపంలోని పేరుమోసిన “వెంకటరమణ జ్యువెలర్స్”లో ఆరు గ్రాముల బంగారు నగ ఆరున్నర గ్రాములు తూగింది. అంటే జ్యువెలర్స్ షాప్ నిర్వాహకులు తూకం వేసే ఎలక్ట్రానిక్‌ కాటాలో టాంపరింగ్‌ చేసి మోసం చేశాడు. ఈ విషయం బాపట్ల జిల్లా తూనికలు కొలతలశాఖ అధికారులు చీరాల పట్టణంలోని బంగారు దుకాణాల్లో తనిఖీలు చేయగా వెలుగులోకి వచ్చింది. షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. “వెంకటరమణ జ్యువెలర్స్” నిర్వాహకులకు రెండు లక్షల రూపాయల మేర జరిమానా విధించి కట్టించుకున్నారు. అయితే అధికారుల తనిఖీలలో తూకంలో తేడాలు బహిర్గతం కావడంతో ఇలా ఎన్ని రోజులు నుంచి కొనుగోలుదారులను మోసం చేస్తూ ధనార్జ చేస్తున్నారో ..? అనే ప్రశ్న తెలెత్తింది. ఆ షాపులో నగలు కొన్న వినియోగదారులు తమ నగలను తిరిగి తూకం వేయించే పనిలో పడ్డారట.

ఈ రెండు ఘటనలు చూస్తుంటే వినియోగదారులను నమ్మకంగా నగల వ్యాపారులు మోసం చేస్తుంటే… మరోవైపు నగల వ్యాపారులను కాకి బంగారం కుదవపెట్టి లక్షలు తీసుకుని ఉడాయిస్తున్నారు ఆరితేరిని కేటుగాళ్లు… బంగారం వ్యాపారులకే నకిలీ బంగారంతో మస్కా కొట్టిన ఆ ఇద్దరు కేటుగాళ్ల గురించి ఇప్పుడు తెగచర్చ నడుస్తుంటే మరో వైపు ఆ ఘరానా మోసగాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.