
దృశ్యం సినిమా తరహా క్రైమ్ మళ్లీ రిపీట్ అయింది.. ఓ వ్యక్తి బెంగళూరు వెళ్తున్నానంటూ వెళ్లాడు.. తర్వాత ఇంటికి రాలేదు.. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు అతని స్నేహితుడే అతన్ని చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో చోటుచేసుకుంది. అనంతపురంలోని మున్నానగర్ ప్రాంతానికి చెందిన అలీ.. బెంగుళూరు వెళ్తున్నానని చెప్పి గత నెల 27న ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తరువాత అలీ ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. రఫీ అనే స్నేహితుడు సుపారీ ఇచ్చి.. అలీని హత్య చేయించాడు. ఆధారాలు మాయం చేసేందుకు దృశ్యం సినిమాలో మాదిరిగానే విశ్వప్రయత్నాలు చేశారు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని దహనం చేసారు. అలీ సెల్ ఫోన్ తీసుకుని మూడు రోజుల పాటు బెంగళూరు, చుట్టుపక్కల తిరిగి పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు నిందితులు. అలీ బతికే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.
ఆర్ధిక లావాదేవీల్లో గొడవలే అలీ హత్యకు కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యలో 11 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. 11 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..