విశాఖ తీరాన్ని గంజాయి మాఫియా గజగజ వణికిస్తోంది. చెత్తబుట్టల మాటున, మురికవాడలే కేంద్రంగా గంజాయి ముఠా సాగిస్తోన్న మత్తు వ్యాపారం విశాఖ ప్రజల్లో కలకలం రేపుతోంది. విశాఖ తీరాన్ని మత్తుజగత్తులో ముంచుతోన్న డ్రగ్స్ మాఫియా సాగర తీరంలో కల్లోలం రేపుతోంది. నిన్న స్క్రాప్ షాప్‌లో మత్తు ఇంజక్షన్ల దందా.. నేడు వైజాగ్ నడిరోడ్డుపై గంజాయి సహా మత్తు ఇంజక్షన్ల వ్యాపారం.. కలకలం రేపుతోంది. రెండురోజుల క్రితం దువ్వాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో.. యాదవ జగ్గరాజుపేట స్క్రాప్ షాప్‌లో భారీగా బయటపడ్డ మత్తు మాఫియా స్థావరం విశాఖలో జడలు విప్పుతోన్న మత్తు జగత్తుని బట్టబయలు చేసింది. అదే విశాఖలో సంచలనం రేకెత్తించింది. దాన్ని మరిచిపోక ముందే విశాఖ నడిబొడ్డున ఎన్‌ఏడీ కొత్తరోడ్ జంక్షన్‌లో పట్టుబడ్డ మత్తు ఇంజక్షన్ల ముఠా వ్యవహారం విశాఖ ప్రజలను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.
విశాఖ ఎన్‌ఏడీ కొత్తరోడ్డు… నిత్యం రద్దీగా ఉండే మార్గంలో పట్టపగలే యథేచ్ఛగా సాగుతోన్న గంజాయి వ్యాపారం గుట్టు రట్టుచేశారు పోలీసులు. గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరు లా యువతను పెడతోవ పట్టిస్తున్న మత్తు ఇంజక్షన్ల రాకెట్ ను విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అధికారులు ఛేదించారు. విశాఖ ప్రజల సహకారంతో… ఈ గంజాయి మాఫియా ముఠాని పట్టుకున్నమన్నారు పోలీసు అధికారి.
ఇటీవల యాదవ జగ్గరాజుపేట స్ర్కాప్ షాప్ మత్తు ఇంజక్షన్ల కేసుతో అప్రమత్తమైన విశాఖ పోలీసులు వైజాగ్‌లో నిఘా పెంచడంతో మత్తు ఈ ముఠా బండారం బట్టబయలైంది. విశాఖపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకి చెందిన గోపాలపట్నం సెబ్ టాస్క్ ఫోర్స్ అండ్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా జరిపిన సోదల్లో మత్తు ఇంజక్షన్ల ముఠా గుట్టురట్టయ్యింది.
మత్తు ఇంజక్షన్ల వ్యాపారం జోరుగా సాగిస్తోన్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 94 మత్తు ఇంజెక్షన్ల అంపిల్స్ ను, 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టూవీలర్ సీజ్ చేశారు.
పోలీసుల విచారణలో వీరు విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం కి చెందిన చందు, పెందుర్తికి చెందిన కొన కళ్యాణ్ సాయి పెందుర్తుకి చెందిన ఎమ్. గణేష్, భీమునిపట్నం చెందిన కల్లా హరి పద్మ రాఘవ రావు గా గుర్తించారు.
కాలేజీ యువకులే లక్ష్యంగా సాగుతోన్న ఈ గంజాయి ముఠా పై ఆరా తీస్తే.. తీగలాగితే డొంక కదిలినట్టు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లలో మత్తు మాఫియా ముఠా మూలాలు బయటపడ్డాయి. ఢిల్లీ కి చెందిన అసిమ్, వెస్ట్ బెంగాల్ చెందిన అనుపమ్ అధికారి, అనే వ్యక్తులు వీరికి మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తున్నట్టు తేలింది.
మత్తు ఇంజక్షన్ కొనుగోలు చేసిన ముద్దాయిలు.. వారు స్వయంగా వినియోగించడంతోపాటు యువతకు విక్రయిస్తున్నారు. విశాఖలోని పలు ప్రాంతాల్లో ఇంకా గంజాయి ముఠా వ్యాపారం సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..