
స్ట్రోక్ చికిత్స రంగంలో భారతదేశానికి మరో అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు, లలిత పీ.వీ.ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూరోసైన్సెస్ విభాగాధిపతి, అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్, గుంటూరు న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ (World Stroke Organization-WSO) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ అత్యున్నత బోర్డులో చోటు దక్కించుకున్న తొలి న్యూరాలజిస్టుగా ఆమె గుర్తింపు పొందారు.
ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది WSO సభ్యులు నిర్వహించిన ఎన్నికల్లో మొత్తం 18 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ఎన్నికయ్యారు. అమెరికా, యూరప్, ఆఫ్రికా-మిడిల్ ఈస్ట్‌లతో పాటు ఉన్న నాలుగు ప్రధాన ఖండాల గ్రూపుల్లో ఆసియా-ఓషియానియా గ్రూపుకు డా. విజయ ప్రాతినిధ్యం వహించనున్నారు. స్ట్రోక్ చికిత్స, పరిశోధన, ప్రజల్లో అవగాహన, ప్రజారోగ్య విధానాల రూపకల్పనలో ఆమె అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ గౌరవం దక్కింది.
ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డులో ప్రస్తుతం భారత్‌కు చెందిన మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నారు. కేరళ, గుజరాత్, ఢిల్లీ, లూధియానాకు చెందిన నిపుణులతో పాటు డా. పి. విజయ కూడా బోర్డులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచ స్ట్రోక్ సంస్థ అధ్యక్షుడిగా భారతీయ న్యూరాలజిస్టు డా. జైరాజ్ పండియన్ కొనసాగుతుండటం విశేషం. ఆసియా నుంచి WSO అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఆయన ఇప్పటికే చరిత్ర సృష్టించారు.
డా. విజయ 2026 నుంచి 2030 వరకు ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ వైద్య విధానాల రూపకల్పన, అంతర్జాతీయ చికిత్స మార్గదర్శకాల అభివృద్ధి, వైద్య విద్యా కార్యక్రమాలు, పరిశోధనలు, జాతీయ స్ట్రోక్ సంఘాల మధ్య సమన్వయం, అవగాహన కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగే కొత్త బోర్డు తొలి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు.
భారతదేశంలో ఆధునిక స్ట్రోక్ వైద్య సేవలకు పునాది వేసిన ప్రముఖ నిపుణుల్లో డా. విజయ ఒకరు. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్ట్రోక్ యూనిట్‌ను ప్రారంభించారు. ముంబై, చెన్నై తర్వాత దేశంలో ఏర్పాటు చేసిన మూడో స్ట్రోక్ యూనిట్‌కు ఆమె నాయకత్వం వహించారు. ఆమె ఆధ్వర్యంలోని అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ భారతదేశంలో గుర్తింపు పొందిన తొలి అక్రెడిటెడ్ అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్‌గా నిలిచింది.
డా. విజయతో పాటు ఆమె నాయకత్వంలోని అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రదానం చేసే పాల్ డడ్లీ వైట్ ఇంటర్నేషనల్ స్కాలర్ అవార్డు, అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (AAN) అందించే ఏ.బి. బేకర్ అవార్డు, ప్రపంచ స్ట్రోక్ సంస్థ–ఏంజెల్స్ కార్యక్రమం నుంచి వరుసగా డైమండ్ స్టేటస్ అవార్డులు పొందడం విశేషం.
డా. పి. విజయ ప్రపంచ స్ట్రోక్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఎన్నిక కావడం భారత వైద్య రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచ స్థాయిలో స్ట్రోక్ వైద్య విధానాల రూపకల్పనలో భారతీయ నిపుణుల పాత్రను మరింత బలోపేతం చేసే అడుగుగా ఆమె ఎన్నికను వారు పేర్కొంటున్నారు.