
ఏపీలోని రేషన్ కార్డుదారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ దుకాణాల్లో ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి కూడా అందించనుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో రూ.20కే గోధుమ పంపిణీ చేయనుంది. ఆదివారం నుంచి జిల్లా కేంద్రాల్లోని రేషన్ షాపుల్లో అందించనుండగా.. త్వరలో డివిజన్, మండల స్థాయిలో కూడా పంపిణీ చేయనుంది. రేషన్ కార్డు ఉన్నవారికి ఇది పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. బయట మార్కెట్లో ఇంట్లోకి అవసరమయ్యే గోధుమ కొనాలంటే సామాన్యులకు ఖర్చుతో కూడుకున్న పని. సామాన్యులతో ఇది భారమనే చెప్పవచ్చు. ప్రభుత్వం కేవలం కేజీ రూ.20కే అందించడం శుభపరిణామంగా చెప్పవచ్చు.
ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, చక్కెర వంటి నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇప్పుడు ఆదివారం నుంచి గోధుమ పండి కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతీ నెలా ఒక్కొ లబ్దిదారుడికి కిలో చొప్పున గోధుమ పంపిణీ చేయనున్నారు. బయట రిటైల్ కిరాణా దుకాణాల్లో కిలో గోధుమ పిండి కొనాలంటే సుమారు రూ.60 నుంచి రూ.65 వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వం కేవలం రూ.20కే అందించడం వల్ల సామాన్యులకు మరో నిత్యావసర సరుకు చవక ధరకే లభించనుంది. బటయ బహిరంగ మార్కెట్లో ధరతో పోలిస్తే రూ.40 తక్కువ ధరకే గోధుమ పండి అందనుంది. ప్యాకెట్ల ద్వారా ఈ పిండిని అందించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గోధుమ పిండి ప్యాకెట్లను రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ సరఫరా చేసింది. వీటిని డీలర్లు లబ్దిదారులకు నేటి నుంచి అందించనున్నారు. రేషన్ సరుకుల జాబితాలో మరో నిత్యావసర వస్తువును చేర్చడంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది డిసెంబర్ 1 నుంచి ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రాగులు, జొన్నలు పంపిణీ చేస్తోంది. ఇందుకోసం బియ్యం కోటాను తగ్గించి వీటిని లబ్దిదారులకు అందిస్తోంది. ఇక రేషన్ దుకాణాలను మినీ మాల్స్‌కు మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా రోజంతా సరుకులు అందించే కార్యక్రమానికి సిద్దమైంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా పలు నగరాలను ఎంచుకున్నారు. ఇక్కడ సుమారు 12 గంటల పాటు షాపు తెరిచి ఉంచుతారు. ప్రస్తుతం నెలలో కేవలం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే షాపులు ఓపెన్ చేసి ఉంటున్నాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరుస్తున్నారు. దీని వల్ల చాలామంది రేషన్ తీసుకోలేకపోతున్నారు. ఇక కొన్నిచోట్ల ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లో డీలర్లు షాపులు తెరవకపోవడం వల్ల లబ్దిదారులు రేషన్ పొందటంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.