
విజయనగరంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామనారాయణం ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కల్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఎన్‌సిఎస్ ట్రస్ట్ నిర్వాహకులు నారాయణం నాగేశ్వరరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు. భక్తుల రామ నామ స్మరణతో ప్రాంగణమంతా శ్రీరామ నామముతో మార్మోగింది. మూడు రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు, పుష్పాలంకరణలు, అర్చనలు నిర్వహించారు. శ్రీ రామ నవమి రోజు సాయంత్రం రామ నారాయణం ప్రాంగణంలో సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ వేడుక భక్తులు ఆధ్యాత్మికంగా భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
కళ్యాణానికి వచ్చిన భక్తులు వాల్మీకి రీసెర్చ్ సెంటర్ సందర్శించి భక్తి పారవశ్యంలో మునిగితేలారు. సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు, జిల్లా ఎస్పీ దామోదర్ దంపతులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు, జిల్లా అధికారులు సమన్వయంతో పని చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. రామనారాయణం ఆలయంలో జరిగిన ఈ సీతారామ కల్యాణం రాష్ట్రస్థాయి ఆధ్యాత్మిక మహోత్సవాన్ని తలపిస్తూ భక్తుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయిందని రామ భక్తులు అన్నారు.