
తిరుమల వెంకన్నకు భక్తులు ఎన్నో రూపాల్లో కానుకలు, విరాళాలు, దానాలు అందించి మొక్కులు తీర్చుకుంటారు. ఆపదమొక్కుల వాడికి ముడుపులు కట్టి మొక్కులు చెల్లించే భక్తులు టీటీడీ ట్రస్ట్‌కు రోజు రూ. లక్షల్లో విరాళాలు అందజేస్తున్నారు. ఇలా వడ్డికాసుల వాడి ఆదాయం అంతకంతకు పెరుగుతుండగా కొందరు భక్తులు గోశాలకు గోవులు, ఇతర పశువులు అందించి దాతలుగా మిగులుతున్నారు. ఇందులో భాగంగానే టీటీడీ ఎస్‌వీ గోశాలకు మగ గుర్రం విరాళంగా వచ్చింది.
మదురైకు చెందిన భక్తుడు వడివేలు ముగంధన్ టీటీడీ ఎస్‌వీ గోశాలకు 9 ఏళ్ల వయస్సు ఉన్న మార్వాడి జాతికి చెందిన తెల్లని మగ గుర్రాన్ని విరాళంగా అందజేశారు. తమిళనాడులోని మధుర మీనాక్షి ఆలయానికి తరచూ గుర్రాలను దానంగా సమర్పిస్తూ వచ్చిన భక్తులు ఈసారి శ్రీవారికి గుర్రాన్ని కానుకగా ఇవ్వాలనుకున్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో తాను ఇచ్చిన గుర్రాన్ని చూడాలన్న కోరికతో మగ గుర్రాన్ని దానంగా అందజేసిన భక్తుడు కోరికను తీర్చుకున్నాడు.
ఈ గుర్రానికి అవసరమైన శిక్షణ పూర్తి చేసిన అనంతరం, శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి సేవలో టీటీడీ వినియోగించనుంది. సోమవారం ఉదయం దాత ఈ గుర్రాన్ని టీటీడీ ఎస్‌వీ గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎన్. శివకుమార్‌కు అప్పగించారు. తాజాగా ఎస్వీ గోశాలలో విరాళం ఇచ్చిన గుర్రంతో కలుపుకుని 5 గుర్రాలు ఉన్నట్లు గోశాల డైరెక్టర్ డా. ఏ.వి.ఎస్. శివకుమార్ తెలిపారు.