Andhra Pradesh: భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి తల్లి ఉగ్రరూపం దాల్చింది.. ఎగువ రాష్ట్రాల నుంచి, ఉపనదుల ద్వారా చేరుతున్న ప్రవాహం కారణంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి ఆగ్రహానికి లక్షలాది ఎకరాల పంట పొలాలతోపాటు గ్రామాలు, జనావాసాలు కూడా మునిగిపోతున్నాయి… ఈ వరదల ప్రభావం వన్య ప్రాణుల మీద కూడా పడింది.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి తీరంలోని అడవుల్లో ఉన్న ప్రాణులు ప్రవాహ వేగంలో కొట్టుకుపోతున్నాయి. రాజమండ్రి(rajahmundry) ధవలేశ్వరం దగ్గర గోదావరిలో పదుల సంఖ్యలో కొట్టుకుపోతున్న జింకలు కనిపించాయి. బొబ్బర్లంక, పొలసలంక వద్ద కొన్ని జింకలను గుర్తించిన స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. ఈ గ్రామంలోకి వచ్చిన జింకలపై కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇలా గాయపడ్డ ఓ జింక కాస్తా మృత్యువాత పడింది. ధవలేశ్వరం(Dhavaleswaram) మీదుగా లంక గ్రామాలకు గోదావరిలో కొట్టుకుపోయిన మరికొన్ని జింకలు… పిచ్చుక లంక, చెముడు లంక, కడియపు లంక ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు అటవీశాఖ అధికారులు.
వరద నీటిలో జింకలు కొట్టుకొస్తే వాటికి ఎలాంటి హానీ చేయకుండా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు అధికారులు. పిచ్చుక లంక , ఊబలంక, అయినవిల్లి, ఆత్రేయపురం, బొబ్బర్లంక ప్రాంతాల్లో 20 మందికి పైగా సిబ్బందితో జింకల కోసం గస్తీ ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..