ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాల వర్షాలు.. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తెలుగు రాష్ట్రాల్లో వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల కారణంగా.. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంటను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ మళ్లీ రెయిన్ అలెర్ట్ ప్రకటించింది. ఉపరతల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా ఆంధ్రాతోపాటు రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అదేవిధంగా తెలంగాణలో సైతం వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇదిలాఉంటే.. తీర ప్రాంతంలో మోచా తుఫాన్ కలకలం రేపుతోంది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని.. ఈ నెల 7 వరకు ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారుతుందని.. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 8 లేదా 9వ తేదీ వరకు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై తీవ్రంగా, మరికొన్ని రాష్ట్రాలపై సాధారణ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..