AP Rains: సముద్రం అల్లకల్లోలం.. ఏపీపై తుఫాన్ ప్రభావం ఇలా.. ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయంటే?

|

Dec 08, 2022 | 12:11 PM

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు 'మండూస్' అని నామకరణం చేశారు.

AP Rains: సముద్రం అల్లకల్లోలం.. ఏపీపై తుఫాన్ ప్రభావం ఇలా.. ఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు పడతాయంటే?
Ap Rains
Follow us on

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఉదయం తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్‌కు ‘మండూస్’ అని నామకరణం చేశారు. ఇది గంటకు 10 కి.మీ వేగంతో నైరుతి బంగాళాఖాతం మీదుగా.. తూర్పు ఆగ్నేయ దిశగా పయనిస్తూ చెన్నై 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ డిసెంబర్ 9వ తేదీ రాత్రి మహాబలిపురంలో తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటికి మండూస్ తుఫాన్ తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున కోస్తాంద్ర, తమిళనాడు, పుదుచ్చేరిలోని తీరా ప్రాంతాలకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. అలాగే రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

ఇక ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలో ఈ మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి., మొదట తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి.. డిసెంబర్ 9 లేదా 10 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. డిసెంబర్ 8 నుంచి 10 మధ్య తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లోని కోస్తా ప్రాంతాలు, బాపట్ల, కృష్ణ జిల్లాలోని కోస్తా భాగాలూ, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని కోస్తా భాగాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. మరోవైపు రాయలసీయం జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు పడనున్నాయి. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా స్వల్పంగా వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు తుఫాన్ తీరాన్ని చేరుకునేసరి ఏపీ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా డిసెంబర్ 9 నుంచి 11 మధ్యలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని దక్షిణ భాగాలు, చిత్తూరు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అదే సమయంలో అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో, ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కాగా, డిసెంబర్ 12, 13 కూడా ఇదే తీరు కొనసాగి.. 14వ తేదీ నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని పేర్కొంది. అటు ఈ నెల 15న అండమాన్‌, దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..