ఏపీకి తుఫాను గండం పొంచి ఉందని తెలిపింది వాతావరణ శాఖ. విశాఖకు ఆగ్నేయంగా కేంద్రీకృతమైన అసాని తుఫాన్ మరో 6 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చిరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాంలో రెండ్రోజులపాటు తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావానికి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఎల్లుడి ఏపీ, ఒడిషా తీరానికి చేరుకోనున్న అసాని తుఫాన్.. బంగాళాఖాతంలోనే బలహీనపడే అవకాశమున్నట్లు వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గాలివాన బీభత్సం చేసింది. అకస్మాత్తుగా వచ్చిన వర్షంతో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. సత్తుపల్లిలో పిడుగుపడి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పలుప్రాంతాల్లో వృక్షలు విరిగిపడ్డాయి. మందలపల్లిలో ఈదురుగాలల అరాచకానికి బొంతు మరియమ్మ అనే మహిళ ఇంటిపైకప్పు లేచిపోయింది. గాలిలో ఎగిరిన రేకులు ఆమెకు తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈదురుగాలుల పెనుబీభత్సానికి గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
ఇక మహారాష్ట్ర విదర్భ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు తెలంగాణలో అక్కడక్కడా..ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది వాతావరణ శాఖ. మరోవైపు ఇవాల్టి నుంచి 4 రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వెల్లడించింది. విపరీతంగా వడగాల్పులు వీస్తాయని..మధ్యాహ్నం ఎండలో ఎవరూ తిరగొద్దని సూచించింది.