
కాకినాడ జిల్లా జగ్గంపేటలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన సైకిల్ మెకానిక్ వర్కర్ కడారి రాజు మంగళవారం రాత్రి జగ్గంపేట జేవియర్ జంక్షన్ మీదుగా పెట్రోల్ బంక్ పక్కన సర్వీస్ రోడ్‌లో ఉన్న తన సైకిల్ మెకానిక్ షాప్‌కు వెళ్తున్నాడు. అలా వెళ్తుండగా జేవియర్ జంక్షన్ వద్ద ఒక పర్సు దొరికింది. అందులో సుమారు 50 వేల రూపాయలు నగదు ఉండడంతో జగ్గంపేట పోలీస్ స్టేషన్‌లో అందజేశాడు. దీంతో జగ్గంపేట ఎస్సై రఘునాథరావు నగదు ఎవరివి అనే దానిపై విచారణ చేపట్టారు.
జేవియర్ జంక్షన్ సీసీ ఫుటేజ్, దొరికిన పర్సులోని ఐడెంటీ ప్రూఫ్‌లను పరిశీలించి, ఆ పర్సు గోకవరం రోడ్డుకు చెందిన బోర్ వెల్స్ రాంబాబుదిగా గుర్తించారు. దీంతో పర్సను, పర్సులో ఉన్న నగదును ఎస్ఐ రఘునాథరావు చేతుల మీదుగా నగదు పోగొట్టుకున్న బాధితుడు రాంబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా నిజాయితీ చాటుకుని దొరికిన నగదును స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి బాధితుడికి అందజేసిన కడారి రాజును ఎస్ఐ రఘునాధరావు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.