
అత్యవసర పరిస్థితుల్లో మనుషుల ప్రాణాలను కాపాడే సిపిఆర్ ప్రక్రియ తెలియడం వల్ల ఓ వ్యక్తి విద్యుత్ షాక్‌కు గురైన ముగ్గురు ప్రాణాలను కాపాడగలిగాడు. దురదృష్టవశాత్తు సమయం సరిపోకా మరో ఇద్దరికి సీపీఆర్ చేస్తుండగానే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రం ఎస్సీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. రానున్న క్రిస్మస్ పండుగ వేడుకల కోసం కాలనీని ముస్తాబు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
అయితే అక్కడే ఉన్న స్నేక్ క్యాచ్ మల్లికార్జున వారిలో ముగ్గురికి సీపీఆర్ చేసి బ్రతికించగలిగాడు. ఒకేసారి ఐదుగురికి సిపిఆర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో.. అతను ఒకరి తర్వాత ఒకరికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. ఈ ప్రయత్నంలో అతను ముగ్గురు ప్రాణాలను కాపాడగలిగాడు. కానీ దురదృష్టవశాత్తు సమయం సరిపోకా మరో ఇద్దరి పరిస్థితి విషమించడంతో ఈర్నపాటి దేవయ్య, పచ్చిగొర్ల విజయకుమార్‌లను త్రిపురాంతకంలోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వారిని పరీక్సించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.