మేత కోసం వచ్చి ప్రమాదవశాత్తు ఓ నూతిలో పడిపోయి నరకం చూసింది ఓ ఆవు. లోతైన ఆ నూతిలో నిటారుగా కూరుకుపోవడంతో బయటకు వచ్చే మార్గం లేక నిస్సహాయంగా ఉండిపోయింది. బయట పడేందుకు విశ్వప్రయత్నం చేసింది. కానీ గోమాతకు కూరుకుపోయిన మట్టిలోంచి బయటపడేందుకు శక్తి సరిపోలేదు. బావి ఇరుకుగా ఉండడంతో ఏమాత్రం వీలు కాలేదు. శక్తినంతా కూడగట్టుకుని మృత్యువుతో పోరాడింది. పట్టు సడలని పోరాట పటిమే ఆ మూగజీవి ఊపిరి నిలిపింది.
చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం దిగువపల్లె పంచాయతీ అప్పినేపల్లె శివార్లలో ఒకచోట చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కల మధ్య పురాతనమైన నుయ్యి ఉంది. అదే గ్రామానికి చెందిన చంద్రాకు చెందిన పాడి ఆవు అక్కడ మేత మేస్తుండగా, దాని వెనుక కాళ్లు నూతిలోకి దిగుబడిపోయాయి. ఊపిరాడక కనుగుడ్లు తేలిపోయి దైన్య స్థితిలోకి వెళ్లిపోయింది ఆ ఆవు.. బతికే ఆశలు అడుగంటుతున్నా మృత్యువుతో పోరాడుతూ వచ్చింది. ఆవు అరుపులు విని యజమాని హుటాహుటిన అక్కడికి వెళ్లాడు. అక్కడే ఉన్న గ్రామ సర్పంచి భర్త వెంకటరెడ్డి, గ్రామస్థులు వచ్చి సహాయ చర్యలు చేపట్టారు. ప్రొక్లయిన్‌ను తెప్పించారు. దాదాపు ఆరు గంటలపాటు తీవ్రంగా శ్రమించి గోవును బయటకు తీసి పునర్జన్మ ప్రసాదించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..