
ఆవు, గేదె వంటి జంతువులకు దురద వస్తే..తోకతో విసురువుకోవటం , చెట్లకు , గోడలకు బలంగా రుద్దుకోవటం చేస్తాయట. ఇలాంటి సమయంలో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయట. ముఖ్యంగా గోవులకు మెడ క్రింది భాగంలో గంగడోలు ఉంటుంది. అది సున్నితంగా ఉండే శరీరభాగం. గంగ డోలు దగ్గర ఇబ్బంది కలిగినపుడు ఆవులు రోడ్లపై వెళుతూ ఎలక్ట్రికల్ స్తంభాలకు , బైక్ హ్యాండిల్ కు రాసుకుంటాయి. అపుడు కొన్ని ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీంతో గోవుల ఇబ్బందులను గమనించిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లోని UKC క్లబ్ , వాసవి క్లబ్ సభ్యులు సయుక్తంగా పాలకొల్లు, యలమంచిలి ప్రాంతాల్లో గోవుల అవస్థలు తీర్చడానికి ఆవులు తిరిగే ప్రధాన కూడళ్లలో గరుకు స్తంభాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 చోట్ల ఏర్పాటైన గరుకు స్తంభాలకు సభ్యులు పూజలు సైతం చేసి గోవులకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఒక్కో గరుకు స్తంభానికి సుమారు 20 వేలు చొప్పున వెచ్చించామని క్లబ్ సభ్యులు చెబుతున్నారు .
గోవు హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రమైనదిగాను, దైవస్వరూపంగా పరిగణించబడుతుంది. గోవు నుంచి లభించే పాలు, పెరుగు, వెన్న వంటి పదార్థాలు ఆరోగ్యకరమైనవిగా, పోషకమైనవిగా పరిగణిస్తారు. అలాగే, గోవు పేడ, మూత్రం కూడా వ్యవసాయంలో ఎరువుగా, క్రిమిసంహారకంగా ఉపయోగపడతాయి. గోవును పూజించడం వలన సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భారతీయుల నమ్మకం. గోమాత పాదాల వద్ద సకల దేవతలు, ఉంటారని హిందువుల నమ్మకం. అలాంటి గోవుల సంరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ముందుకు వస్తున్నాయి. గోవులను సంరక్షించడం తో పాటు వాటికి కావలసిన ఆహారం నీరు అందిస్తున్నారు . దీని తోపాటు వాటి అవసరాలకోసం గరుకు స్థంభాలను ఏర్పాటు చేయడం పట్ల గో ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..