Andhra Pradesh: దొంగల్ని పట్టించిన కూల్ డ్రింక్.. సినిమా లెవెల్ స్కెచ్.. ఎలా దొరికిపోయారంటే..?
ఒంటరిగా ఉండే వృద్ధురాలి మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసు కొట్టేయాలని మాస్కులు ధరించి ఇంట్లోకి చొరబడ్డారు. వెనుక గేటు నుంచి తప్పించుకోవడంతో ఘటనా స్థలంలో పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ చోరీకి సరిగ్గా పది నిమిషాల ముందు బాధితురాలు తాగిన ఒక్క కూల్ డ్రింక్ నిందితులను పట్టించింది. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఒంటరిగా ఉండే వృద్ధురాలిపై కన్నేశారు.. ముఖాలకు మాస్కులు తగిలించుకుని ఇంట్లోకి చొరబడి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరకకపోయినా.. బాధితురాలు తాగిన ఒక్క కూల్ డ్రింక్ నిందితుల పాలిట ఉచ్చుగా మారింది. పోలీసులు పక్కా వ్యూహంతో దర్యాప్తు చేపట్టి నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. నిడుబ్రోలులోని గౌడపాలెం ప్రాంతానికి చెందిన పులిమి సుశీల దేవి అనే వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంటి సమీపంలో ఉండే రజిని అనే మహిళతో పరిచయం ఉంది. సుశీల దేవికి అప్పుడప్పుడు కూల్ డ్రింక్ తాగే అలవాటు ఉండటంతో రజినికి డబ్బులిచ్చి తెప్పించుకునేది. ఈ క్రమంలోనే సుశీల దేవి ఒంటరిగా ఉంటున్న విషయాన్ని, ఆమె మెడలో సుమారు 20 గ్రాములకు పైగా బరువున్న బంగారు చైన్ నిరంతరం ఉండటాన్ని రజిని గమనించింది. ఎలాగైనా ఆ బంగారాన్ని కాజేయాలని పథకం రచించింది.
మాస్కులతో ఇంట్లోకి చొరబడి..
తన పథకాన్ని అమలు చేసేందుకు రజిని.. తనకు పరిచయం ఉన్న రవికుమార్ అనే వ్యక్తితో చేతులు కలిపింది. పక్కా ప్లాన్ ప్రకారం.. వారం రోజుల క్రితం రజిని తన అక్క కొడుకైన యోగేష్ అనే బాలుడి చేతికి కూల్ డ్రింక్ ఇచ్చి సుశీల దేవి ఇంటికి పంపించింది. వృద్ధురాలు ఇంట్లో ఒక్కతే ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసింది. యోగేష్ కూల్ డ్రింక్ ఇచ్చి వచ్చి.. బామ్మ ఒక్కరే ఉందని రజినికి సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన రజిని, రవికుమార్ ముఖాలకు మాస్కులు ధరించి సుశీల దేవి ఇంటి వెనుక గేటు నుంచి దొంగతనంగా లోపలికి ప్రవేశించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని బెదిరించి.. ప్రతిఘటించే లోపే ఆమె మెడలోని 20 గ్రాముల బంగారు గొలుసును బలంగా లాక్కుని క్షణాల్లో పరారయ్యారు.
కూల్ డ్రింక్ ఇచ్చిన చిన్న క్లూతో..
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే నిందితులు ముఖాలకు మాస్కులు ధరించడం, వెనుక గేటు నుంచి పారిపోవడంతో ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో చోరీ జరగడానికి ముందు ఇంట్లో ఏమేం జరిగాయని పోలీసులు వృద్ధురాలిని ఆరా తీశారు. ఆ సమయంలో ‘‘చోరీ జరగడానికి కొద్దిసేపటి ముందే ఒక బాలుడు నాకు కూల్ డ్రింక్ తెచ్చి ఇచ్చాడు’’ అని సుశీల దేవి చెప్పిన చిన్న సమాచారం పోలీసులకు కీలక ఆధారంగా మారింది.
నిందితుల అరెస్ట్
పోలీసులు ఆ బాలుడిని గుర్తించి విచారించగా, కూల్ డ్రింక్ ఇచ్చి పంపింది తన పిన్ని రజినేనని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి రజినిని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరం మొత్తం బయటపడింది. సుశీల దేవి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని, రవికుమార్తో కలిసి తానే ఈ స్కెచ్ వేసినట్లు ఒప్పుకుంది. పోలీసులు రజిని, రవికుమార్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 20 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. చిన్నపాటి క్లూతో కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీసుల పనితీరును స్థానికులు అభినందించారు.
