Cold Wave: ‘చలి పంజా’.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు అప్రమత్తత అవసరం..

|

Jan 09, 2023 | 9:45 AM

సంక్రాంతి పండక్కి ముందే చలి చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ..

Cold Wave: చలి పంజా.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక.. వచ్చే మూడు రోజులు అప్రమత్తత అవసరం..
Cold Waves Telugu States
Follow us on

సంక్రాంతి పండక్కి ముందే చలి చంపేస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అటు ఏపీ, ఇటు తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలితీవ్రత విపరీతంగా పెరిగింది. ఉదయం వేళలో ఒకవైపు పొగమంచు, మరో వైపు గడ్డకట్టుకుపోయే చలితో ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు ప్రాంతాల్లో అయితే 5 డిగ్రీలలోపే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈశాన్య గాలులతో చలితీవ్రత పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మధ్యప్రదేశ్, విదర్భ నుంచి వీస్తున్న చలిగాలులతో వచ్చే 2 రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజులు హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు హైదరాబాద్‌లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. సో.. వచ్చే రెండు, మూడురోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది.

ఏపీలో ‘కోల్డ్ వేవ్ ఎఫెక్ట్’..

ఏపీలోని అల్లూరి జిల్లా ఏజెన్సీలో చలి చంపేస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీలోని మినుమూరులో 8 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు నమోదయ్యాయి.అరకులోయలో 10 డిగ్రీలు నమోదయ్యాయి. జి.మాడ్గుల్లో బయటపార్క్‌ చేసిన వాహనాలపై మంచు పేరుకుపోయింది. టెంపరేచర్‌ డౌన్‌ అయ్యేకొద్ది పొగమంచు గడ్డ కడుతోంది. వాహనాలపై గాజులా పేరుకుపోయింది మంచు. కొన్నేళ్ల తర్వాత మంచు గడ్డకట్టిన దృశ్యాలు ఏజెన్సీ ఏరియాలో కనిపిస్తున్నాయి. అలాగే చింతపల్లి, హుకుంపేట, జి. మాడుగుల, జీకే వీధిలో 1.5 డిగ్రీలు, గంపరాయిలో 2.6, పాడేరులో 3.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ వేవ్ కొనసాగుతోందని.. దీని ప్రభావం 3 రోజుల పాటు ఉంటుందని, ప్రజలు అజాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది.

ఉత్తరాధిలో కొనసాగుతున్న ‘కోల్డ్ వేవ్’..

మరోవైపు ఉత్తరాధిలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. చలిపులి చంపేస్తోంది. తీవ్రమైన చలిగాలులతో జనం బయటికి కూడా రావడం లేదు. చలి తీవ్రత, దట్టమైన పొగమంచు వల్ల విమానాలు, రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. గత రెండేళ్లలో ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు ఎఫెక్ట్‌తో ఢిల్లీ నుంచి వెళ్లే 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాగా, రాబోయే మూడు రోజులలో ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, త్రిపురలలో దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా.. ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రతీ రోజు విపరీతమైన చల్లగాలులు వీస్తున్నాయి. జలుబులో ఒక్కసారిగా రక్తపోటు పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. నిన్న ఒక్కరోజే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా 14 మంది చనిపోయినట్లు తెలిపారు.