ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన వైసీపీ.. ఈసారి ఆ రికార్డును అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వై నాట్ 175 అంటూ క్లీన్ స్వీప్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ఇప్పటికే గత నెల రోజులుగా నియోజకవర్గాల వారీగా ఇంచార్జీల మార్పుపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటివరకు నాలుగో విడతల్లో 50 మంది అసెంబ్లీ ఇంచార్జిలు,10 లోక్ సభ ఇంచార్జి లను నియమించారు. వీరిలో కొంత మందికి సీటు నిరాకరిస్తే, మరికొంతమందిని వేరే నియోజకవర్గాలకు మార్పు చేశారు. కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. త్వరలో చివరి విడత జాబితా విడుదలపై కసరత్తు చేస్తున్నారు వైఎస్ జగన్. మరో 10 మంది ఎంపీ లు, ఐదారు అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేయనున్నట్లు తెలిస్తోంది. ఈ క్రమంలోనే రేపల్లె, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, విజయవాడ వెస్ట్ స్థానాల్లో ఇటీవల ప్రకటించిన ఇంచార్జిల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారట.
రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లుగా చేస్తున్న సర్వేలు, ప్రజల్లో సానుకూలత లేని సిట్టింగ్‌లకు సీటు నిరాకరించారు వైసీపీ అధినేత. ఇలా సీటు కోల్పోయిన వారు కొత్తగా వచ్చిన ఇంచార్జిలకు సహకారం అందించడంలో పూర్తిగా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. మరికొంతమందిని స్వయంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలిచి వారికి నచ్చచెప్పడంతో సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన స్థానాల్లో కూడా ఇంచార్జిల మార్పులు చేర్పులను ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం అభ్యర్థుల ఎంపిక తర్వాత ప్రజల్లోకి వెళ్లనున్నారు సీఎం జగన్. ఇప్పటి వరకూ సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి.. ఈ నెల 27 నుంచి రాజకీయ సభలు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు.
26 జిల్లాల కేడర్‌తో సీఎం జగన్ సమావేశాలు
ఈ నెల 27 లోగా అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటి వరకు అసెంబ్లీ, లోక్ సభ కలిపి 69 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. మరో 15 స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. వీటన్నింటినీ ఈ నెల 27 లోగా పూర్తి చేయనున్నారు. ఈ నెల 27 నుంచి బహిరంగ సభలు, కేడర్ తో సమావేశాల్లో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. కొన్ని జిల్లాలను కలిపి ఒకే చోట బహిరంగ సభ పెట్టడం, అదే రోజు సాయంత్రం ఆయా జిల్లాల కేడర్ తో సమావేశాలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
26 జిల్లాలుే.. అయిదు బహిరంగ సభలు
ఈ నెల 27 న ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి బహిరంగ సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మొత్తం 26 జిల్లాలకు కలిపి అయిదు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో వైసీపీ ఎన్నికల సభలుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు..ఫిబ్రవరి 10 వ తేదీ లోగా అన్ని సభలను పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో పార్టీ కేడర్ కీలక పాత్ర పోషిస్తుంటారు. .అందుకే కేడర్ తో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.
కార్యకర్తలకు దిశానిర్ధేశం
పార్టీ అభ్యర్థుల మార్పు ఎందుకు చేయాల్సి వచ్చింది…ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి. వచ్చే ఎన్నికల్లో గెలుపునకు ఏం చేయాలి. కేడర్ పాత్ర ఎలా ఉండాలి వంటి అంశాలపై వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇలా చేయడం ద్వారా కొత్తగా నియమించిన ఇంచార్జిలకు కేడర్ నుంచి మంచి సహకారం అందుతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఇప్పటివరకు పలు సంక్షేమ పథకాలకు నిధులు విడుదల, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం కోసం జిల్లాల పర్యటనలు చేసిన ముఖ్యమంత్రి, ఇకపై రాజకీయంగా దూకుడుగా ముందుకువెళ్లి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని నిర్ణయించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…