ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐపాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్‌తో కొద్దిసేపు సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి పాల్గొన్న తర్వాత ఈ సమావేశం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ఐపీఏసీ సీఎం జగన్‌తో కలిసి పనిచేస్తోంది. IPAC నుంచి వైదొలిగినట్లు ప్రశాంత్ చెప్పినప్పటికీ.. అతను తన బృందాలకు మార్గనిర్దేశం చేస్తున్నారని సమాచారం. ఏపీలోని IPAC బృందం మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తే ప్రతి ఎమ్మెల్యేపైనా సొంతంగా అంచనా వేసి ప్రత్యామ్నాయ పేర్లను సూచించినట్లుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో క్రమంగా పుంజుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దానికి సంబంధించిన నివేదికల నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసేందుకు ఐ-ప్యాక్‌ని వరుసగా రెండోసారి నియమించుకోవాలని వైసీపీ నిర్ణయించింది.
బుధవారం రోజున తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగే కార్యకర్తల సమావేశంలో ఐ-ప్యాక్ నియామకాన్ని జగన్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పార్టీ నేతలకు రిషి రాజ్ సింగ్‌ను పరిచయం చేయాలని భావిస్తున్నట్లు పార్టీ నేత ఒకరు తెలిపారు.
ఇవాళ్టి ఈ భేటీలో ప్రశాంత్‌తో జగన్ ఈ నివేదికలను పంచుకున్నారని, 2024 ఎన్నికలకు కొత్త వాగ్దానాలు చేయాల్సిన అవసరం లేదని, తన నవరత్నాలతో ప్రజల్లోకి వెళ్లాలని ఎన్నికల వ్యూహకర్త పీకే సీఎంకు సూచించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జగన్ తన పని తీరును బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో తమ ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయాలని పీకే సూచించినట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో కనీసం 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను బరిలోకి దించి కొత్త ముఖాలను తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే 175 మంది అభ్యర్థులపై సీఎం ప్రశాంత్ కిషోర్ సమీక్ష జరిపినట్లు సమాచారం.
కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను భర్తీ చేయాలని నెల రోజుల క్రితం నిర్ణయం తీసుకోగా.. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని కిషోర్, అతని ఐపాక్ బృందం కోరిక మేరకు మార్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టెక్కలి అభ్యర్థిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను జగన్ ప్రకటించినప్పటికీ.. గత వారం ఆయనను తప్పించి, టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు అయిన ఆయన భార్య వాణిని అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. మెుదటి ఎన్నికల్లో విజయం సాధించి 2014 లో చంద్రబాబు నాయుడు పీఠమెక్కారు. రెండోసారి 2019 ఎన్నికల్లోనూ చంద్రబాబుకే పట్టం కడుతారని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అంతా రివర్స్ అయ్యింది. అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో.. భారీ మెజారిటీతో జగన్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ చరిష్మాతోపాటు.. ఆయన కోసం పని చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ దీని వెనుక ఉన్న సంగతి తెలిసిందే. వెనకాలే ఉంటూ.. ఎన్నికలకు ముందు నుంచే.. ఎలా ప్రణాళికతో వెళ్లాలనే అంశాలపై జగన్ ను గైడ్ చేశారు పీకే. మళ్లీ ఇప్పుడు ఆ సీన్ రిపిట్ చేయాలని సీఎం జగన్ అనుకుంటున్నారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సేవలను వరుసగా రెండోసారి ఉపయోగించుకునేందుకు నియమించుకున్నట్టుగా సమాచారం. మళ్లీ పీకే బృందంతో ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఐ ప్యాక్ పక్కా ప్లాన్ తో వర్క్ చేసింది. 175 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో 151 సీట్లు, 25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 సీట్లు గెలుచుకునేలా చేయడంలో పీకే మైండ్ గేమ్ కూడా ఉంది. మళ్లీ ఐ-ప్యాక్ పార్టీ కోసం పని చేయనుంది. 2024 ఎన్నికల్లో జగన్ ను గెలిపించేందుకు ప్రణాళికలు వేస్తోంది.
గతంలో జరిగినట్టు ప్రశాంత్ కిషోర్ ఈసారి ఏపీలో వైఎస్సార్‌సీపీతో నేరుగా రంగంలోకి దిగడు. కిషోర్ సహోద్యోగి, ఐ-ప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ నేతృత్వంలోని బృందం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పని చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ ఐ-ప్యాక్‌ని నియమించుకున్నాయి. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పని చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పటికే ఐ ప్యాక్ తో డీల్ కుదుర్చుకున్నారు. టీఆర్ఎస్‌తో ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో పీకే, కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. తరువాత టీఆర్‌ఎస్ కోసం, కేసీఆర్ జాతీయ రాజకీయాలకు సంబంధించి పీకే ఐ ప్యాక్ పని చేస్తోందని తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ కూడా ఐ-ప్యాక్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ధృవీకరించిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం