Disha App Awareness Program: ప్రతి మహిళకు ‘దిశ’ యాప్ అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ దిశ యాప్‌ను ప్రతిఒక్క మహిళతో డౌన్‌లోడ్ చేయించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామానికి చేరుకున్న అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. దీనిలో భాగంగా మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి మహిళకు దిశ యాప్ అవసరమని, దిశ యాప్‌పై ఇంటి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించాలని తెలిపారు. దిశ యాప్‌కు మహిళా పోలీసులు, వాలంటీర్లే అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఘటన కలిచివేసిందని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.
యువతులు, మహిళల భద్రత కోసం ఈ దిశ యాప్ రూపొందించామని, ఇప్పటికే దిశ యాప్ నాలుగు అవార్డులు సొంతం చేసుకుందని గుర్తుచేశారు. ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సూచించారు. ఫోన్‌లో దిశ యాప్ ఉంటే ఒక అన్న తోడుగా ఉన్నట్టేనని.. ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్ అని తెలిపారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులను.. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్ తేల్చిచెప్పారు.
అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్‌లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షించారు. ఈ సందర్భంగా దిశ యాప్ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా వివరించారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరించారు. దిశా యాప్ పై , డౌన్లోడ్ పై అవగాహన కలిగించే గోడ పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు
Also Read: