CM Jagan: ఆర్థిక వ్యవస్థ పురోగమించాలంటే పెట్టుబడులే కీలకం.. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్

|

May 27, 2023 | 7:03 PM

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు'

CM Jagan: ఆర్థిక వ్యవస్థ పురోగమించాలంటే పెట్టుబడులే కీలకం.. నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్
Cm Jagan
Follow us on

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు’ ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతంచేయాలి. తద్వారా ఆర్థికవ్యవస్థ శ్రీఘ్రగతిన పురోగమిస్తుంది. భారతదేశంలో లాజిస్టిక్స్‌ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. లాజిస్టిక్స్‌ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో చూసుకుంటే లాజిస్టిక్స్‌ ఖర్చు కేవలం 7.5శాతానికే పరిమితం అయ్యింది. గడచిన తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లుచ జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయరీతిలో వ్యవయం చేస్తోంది. మనం ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా PPP పద్ధతిలో నిర్మిస్తోంది’

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీనే ఫస్ట్‌

‘ దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85% దాటినప్పుడే ‘వికసిత్ భారత్’ లక్ష్యం నెరవేరుతుంది. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5%. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయం, పెట్టుబడులు రెండింటికి సంబంధించిన అంశాలపై అత్యంత దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఆహారరంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం చాలా అవసరం. తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇంకా, మేము వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేశాం. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించి రద్దు చేసాం’

ఇవి కూడా చదవండి

హెల్త్‌ కేర్‌పై ప్రత్యేక దృష్టి..

‘ విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023కి అద్భుతమైన స్పందన లభించించింది. రూ. 13 లక్షల కోట్లు భారీ పెట్టుబడులకు వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పాటవుతున్నాయి. ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమని నేను గట్టిగా చెప్పదలచుకున్నాను. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు పెరుగుతున్న NCD (సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధుల)ల భారం గురించి మనం తెలుసుకోవాలి. హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిషరీ హెల్త్‌కేర్‌ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధపెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌, పౌష్టికాహారంపై అత్యంత శ్రద్ధపెట్టాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసింది, ఇందులో ఒక మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్‌, ఒక ANMను, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచాం. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరాల కాలంలో, రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిని నియమించింది. విలేజ్‌ క్లినిక్‌ల నుండి బోధనాసుపత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ ఉండేలా చూసుకున్నాం’

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సేవలతో..

‘ విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించింది, ఇందులో PHCల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్‌, వార్డు క్లినిక్స్‌ల సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని మేం ప్రగాఢంగా నమ్ముతున్నాం. నైపుణ్యాభివృద్ధిఅన్నది మరొక కీలక అంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరికి శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయస్సున్న జనాభా విషయంలో తీవ్రకొరతను ఎదుర్కొంటున్నాయి. అదృష్టవశాత్తూ, దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయస్సున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. కానీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, లార్జ్‌ లాంగ్వేజ్ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులను, ప్రక్రియలను, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్యప్రణాళికను డైనమిక్‌గా తీర్చిదిద్దాలి’

అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాలి..

‘సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. నేను వాటిలో కొన్నింటిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అదే మహిళకు 4 సంవత్సరాలలో స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం.
– అంతేకాకుండా, మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతుంది. అందువల్ల, సున్నా వడ్డి కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై SHGలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది. కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోదు. పెట్టుబడి పెట్టడానికి మరియు తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. అందువల్ల, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అనుసంధానాలను పొందడంలో మహిళలను చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి. చివరగా అన్ని రాష్ట్రాలూ కూడా ఒక జట్టుగా పనిచేయాలి. ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడిఉంటుంది’ అని జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  క్లిక్ చేయండి..