Andhra Pradesh: అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు అల్టిమేటం..

సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో పాలనలో పారదర్శకత, పనితీరు మెరుగుదలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఆర్థికేతర సమస్యల పరిష్కారం, ఫైల్స్ ఆన్‌లైన్ చేయడం, రెవిన్యూ శాఖలో అవినీతిపై కఠిన చర్యలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ్, స్మార్ట్ కిచెన్ వంటి ఉత్తమ ప్రాజెక్టులను ప్రశంసించారు. శాంతిభద్రతల మెరుగుదలకు కృషి చేయాలని సూచించారు.

Andhra Pradesh: అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు అల్టిమేటం..
Cm Chandra Babu

Updated on: Dec 19, 2025 | 11:36 AM

రెండురోజుల పాటు మారథాన్‌లా సాగిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నిప్పులూ చెరిగడంతో పాటు నవ్వులూ పూయించారు. కంటెంట్ ఉండాలి, కమిట్‌మెంటూ కావాలి.. అప్పుడే ఔట్‌కమ్ బావుండేది.. ఎవరికి వారు బాగా పనిచేస్తున్నామని చెప్పుకుంటే సరిపోదని అన్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తే, ఎన్ని టార్గెట్లయినా రీచ్ అవ్వడం ఈజీ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారు. పనిలో పనిగా కొత్త టార్గెట్లు కూడా ఇచ్చేశారు. ఆర్థికేతర సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని, రెవిన్యూ శాఖలో గొడవలు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనవరి కల్లా ఫైల్స్ అన్నీ ఆన్‌లైన్ చేయాలని హుకుం జారీ చేశారు.

రెండోరోజు ఆరు జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన కొన్ని ప్రాజెక్టుల నమూనాల్ని చంద్రబాబు మనసారా మెచ్చుకున్నారు. విద్యార్థుల్లో ప్రతిభ కోసం ప్రాజెక్ట్ నిర్మాణ్, పరిశుభ్రత కోసం ముస్తాబు ప్రోగ్రామ్స్‌పై ప్రత్యేకంగా ఆరా తీశారు. నాటుసారా తయారీదారుల జీవితాల్లో పరివర్తన కోసం ప్రాజెక్ట్ మార్పు, రైతుల్లో సాధికారత కోసం ఛాంపియన్ ఫార్మర్స్.. అన్నీ బెస్ట్ ప్రాక్టీసెస్‌ అని, రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కడప జిల్లాలో స్మార్ట్ కిచెన్‌ ప్రాజెక్ట్ దేశానికే మోడల్‌గా మారిందంటూ మంత్రి లోకేష్‌ కూడా ఇంటరాక్ట్ అయ్యారు. క్లాసులు పీకడం, టార్గెట్లు ఇవ్వడమే కాదు, బాగాపనిచేసిన అధికారులకు ప్రశంసలూ దక్కాయి.

అదేవిధంగా శాంతిభద్రతలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేరాలు 5.5 శాతం తగ్గాయని కాంప్లిమెంట్ ఇచ్చారు. క్రైమ్ రేట్‌ను ఇంకా తగ్గించాలని ఎస్పీలను ఆదేశించారు. 18 నెలలల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపై చర్చ జరపడమే కాదు, పెర్ఫామెన్స్‌లో కలెక్టర్ల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించేలా ఈ సమావేశాలు సాగాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..