అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేవరకు కూటమి కలిసే ముందుకు సాగుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొత్తం ఐదు రోజులు సమావేశాలు నిర్వహించాలని తీర్మానించారు. సభకు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ప్రారంభించారు. అమరావతికి కేంద్రం నిధులు మంజూరు చేసిందన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ అందిస్తోందని తెలిపారు. అందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సూపర్ సిక్స్ తప్పకుండా అమలు చేస్తామన్నారు. కేంద్రం పోలవరం పూర్తిచేస్తామనడం అభినందనీయం అన్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
జూన్ 4న వచ్చిన ఫలితాలు కొత్త చరిత్ర సృష్టించాయన్నారు. ఏపీలో ఎన్డీయే కూటమికి 93శాతం స్ట్రైక్ రేట్.. 57శాతం ఓట్లు వచ్చాయన్నారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలాంటి ఫలితాలు రాలేదన్నారు. భవిష్యత్ తరాల కోసం బాధ్యతతో ఓటేశారని ఓటర్లను కొనియాడారు. టీడీపీ, జనసేనకు బీజేపీ తోడవడంతో ఎన్నికల ఫలితాల్లో సునామీ వచ్చిందని చెప్పారు. అలాగే సామాజిక బాధ్యతతో పవన్ ముందుకు వచ్చారని తెలిపారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని, రాష్ట్రంలో అప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనించి పవనే ముందు పొత్తును ప్రకటించారన్నారు. బీజేపీ కూడా కలిసిరావడంతో భారీ విజయం సాధించామన్నారు సీఎం చంద్రబాబు. ఇదే క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశిస్తూ చురకలు అంటించారు. ప్రతిపక్ష నాయకుడికి సభకు వచ్చే ధైర్యం లేదని విమర్శించారు. గతంలో ఏమైనా మంచి పనులు చేసి ఉంటే చెప్పేందుకు ధైర్యం ఉంటుందన్నారు. అయితే గతంలో ఏమీ చేయలేదు కాబట్టి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో రాజకీయం చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆనందించారు. రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడంతోపాటూ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నందుకు అభినందించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..