బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అధికారులను అప్రమత్తం చేశారు. కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం.. ఆయా జిల్లాల్లో పరిస్థితులు, నమోదైన వర్షపాతం వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నమోదైన వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని..ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఏలేరు రిజర్వాయర్‌కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని అధికారులను ఆదేశించారు.. చంద్రబాబు. భారీ, అతిభారీ వర్షాలు ఉండే ప్రాంతంలో తాగునీరు, ఆహారం, మెడికల్ క్యాంప్‌లకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడం ద్వారా ప్రాణనష్టం లేకుండా చూసుకోవాలన్నారు. పంట నష్టం అంచనా, బాధితులకు ఆహారం సరఫరా, వరద పరిస్థితులను గమనించేందుకు డ్రోన్లు వినియోగించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించడంతో పాటు.. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.
పరిస్థితి తీవ్రతను బట్టి సహాయం కోసం సెంట్రల్ కంట్రోల్ టీమ్‌ను సంప్రదించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తే ఒక జిల్లా నుంచి మరో జిల్లా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. వరద, భారీ వర్షాలపై ప్రజల ఫోన్లకు అలర్ట్ మెసేజ్ లు పంపించాలని తెలిపారు. వాగులు, వంకలు దాటే సమయంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా ఆంక్షలు విధించాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి ప్రమాదం బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా స్థాయిలో తీసుకునే చర్యలకు అప్పటికప్పుడే నిధులు విడుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వాతావరణంలో మార్పులే ఈ వరదలకు కాణమని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణానదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రవాహం వచ్చిందన్నారు.. విజయవాడలో.. 8వ రోజు కూడా కొన్ని ప్రాంతాలు నీటి లోనే ఉన్నాయని తెలిపారు. అందరికీ సహాయాన్ని అందిస్తున్నామని.. పారిశుధ్యంపై ఫోకస్ పెట్టామని తెలిపారు. వరద సహాయక చర్యలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తంచేశారని తెలిపారు. ముందస్తు చర్యలపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
విజయవాడను వరద ముంచెత్తి వారం రోజులు దాటిపోయింది. ప్రభుత్వం భారీ ఎత్తున సహాయక చర్యలు చేపడుతున్నా..అనేక కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నగరంలోని న్యూరాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, ఊర్మిళనగర్, సుందరయ్యకాలనీ, రాజీవ్‌నగర్, ప్రకాష్‌నగర్, రాధానగర్, రాజానగర్, కండ్రిక, వాంబే కాలనీల్లో ఇంకా వరద కష్టాలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఇప్పటికీ సుమారు 10 వార్డుల్లో వరదనీరు భయపెట్టే స్థితిలోనే ఉంది. 286 సచివాలయాల్లో 149 సచివాలయాల పరిధిలో నివాసాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఇంకా పునరుద్దరించకపోవడంతో..ట్యాంకర్ల ద్వారా వచ్చే నీళ్లే దిక్కవుతోంది.ఇక అంబాపురంలో పోటెత్తిన వరదనీరు..ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల్ని నిండా ముంచేసింది. పుస్తకాలు, ప్రింటింగ్ మిషన్లు తడిసి ముద్దయిపోవడంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..