CM Chandrababu: భవిష్యత్తులో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

|

Jan 12, 2025 | 8:45 PM

ఏపీలో పుష్కలంగా సహజ వనరులున్నాయన్న చంద్రబాబు.. వాటిని ఎగుమతి చేసేందుకు హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని చెప్పారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా కోసం పని చేస్తున్నామని తెలిపారు.

CM Chandrababu: భవిష్యత్తులో గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Cm Chandrababu
Follow us on

దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదే అని చెప్పారు. ఇప్పుడు దీపం-2 పథకం కింద మూడు సిలెండర్లను ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే గ్రీన్‌ ఎనర్జీ హబ్‌గా మారుతుందన్నారు. భవిష్యత్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తామన్నారు. గ్రీన్‌ ఎనర్జీ వల్ల అనేక ఉపయోగాలున్నాయని, 99 లక్షల కుటుంబాలకు గ్యాస్‌ సరఫరా చేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో పుష్కలంగా సహజ వనరులున్నాయన్న చంద్రబాబు.. వాటిని ఎగుమతి చేసేందుకు హైవేలు, సముద్రతీరం, పోర్టులు, విమానాశ్రయాలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరాకు 5 కంపెనీలను సంప్రదించామని చెప్పారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధన దిశగా కోసం పని చేస్తున్నామని తెలిపారు. కేజీ బేసిన్‌ 40 శాతం గ్యాస్ లభిస్తోందని.. గుజరాత్ సహా ఇతర రాష్ట్రాల వారు దాన్ని ఎక్కువగా వాడుకుంటున్నారని చంద్రబాబు అన్నారు.

ఆ గ్యాస్‌ను ఏపీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రణాళిక రూపొందిస్తామన్నారు. గ్రీన్ ఎనర్జీ అనేది చాలా కీలకంగా మారుతుందని.. గ్రీన్ ఎనర్జీలో 10 లక్షల కోట్లు టార్గెట్‌గా నూతన పాలసీని విడుదల చేశాం‌మని చెప్పారు. విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల విలువైన జెన్ కో, ఎన్‌టీపిసి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారని గుర్తు చేశారు. సోలార్ ఎనర్జీ ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా కరెంట్ అందించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నామని చంద్రబాబు వివరించారు.

అంతకుముందు తిరుచానూరులో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ పంపిణీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే లబ్ధిదారుడి ఇంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు.. స్వయంగా గ్యాస్ స్టవ్‌పై టీ తయారు చేశారు. అనంతరం ప్రథమ్‌-థింక్‌ గ్యాస్‌ CNG వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..