CJI NV Ramana: కార్యనిర్వాహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టుల జోక్యం అవసరం.. కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ

|

Dec 25, 2021 | 9:09 PM

న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోవద్దని, పౌరుల హక్కులకు భంగం కలిగితే కోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటమణ సూచించారు. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు.

CJI NV Ramana: కార్యనిర్వాహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టుల జోక్యం అవసరం.. కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ
Cji Nv Ramana 1
Follow us on

CJI NV Ramana received Rotary Club Award: న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోవద్దని, పౌరుల హక్కులకు భంగం కలిగితే కోర్టు జోక్యం చేసుకోవాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటమణ సూచించారు. కార్యనిర్వాహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు ఏ సమస్య వచ్చినా న్యాయ స్థానాన్ని ఆశ్రయించాలి. కోర్టుల పట్ల చిన్నవారు నుంచి పెద్ద వారు‌వరకు అవగాహన పెంచుకోవాలి. నేటికీ సరైన అవగాహన ప్రజల్లో లేదన్నారు చీఫ్ జస్టిస్.

ఏపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సీజేఐ ఎన్వీ రమణకు జీవిత సాఫల్య పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ ‘‘ఈ పురస్కారంతో నువ్వు ఇంకా చాలా‌ చేయాలనే హెచ్చరిక లాంటిది. నా బాధ్యత మరింత పెరగడంతో పాటు తెలుగువాడిగా గౌరవాన్ని నిలపెట్టడానికి కృషి చేస్తాను. నాకున్న పరిమితుల మేరకు న్యాయం అందేలా చూస్తా. నా గుణగణాలను‌ చూసి నాకు అవార్డు ఇవ్వడాన్ని సంతోషిస్తున్నాను. 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతున్నాం. నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజ్యాంగంపై పెద్ద చర్చ నడుస్తుంది. దీనిపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలి. ప్రజలు తమ హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలి.’’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలందరికీ చేరాలని చీఫ్ జస్టిస్ అన్నారు. ఎంతో అభివృద్ధి చెందుతున్నా… నిరక్షరాస్యత, అనారోగ్యం, విద్య, మూఢ నమ్మకాలతో బాధ పడుతున్నామని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. భారత లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ‌ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. న్యాయ సహాయంకోసం, రాజ్యాంగ హక్కుల కోసం రోటరీ క్లబ్ సభ్యులు కొంత సమయం కేటాయించాలన్నారు. మేధావి వర్గంగా ఉన్న వారంతా ప్రజలకు రాజ్యాంగం, హక్కుల గురించి తెలియ చెప్పాల్సిన అవసరముందన్నారు. అన్ని వ్యవస్థల తరహాలో న్యాయ వ్యవస్థ కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందని గుర్తు చేసిన ఎన్వీ రమణ.. న్యాయ వ్యవస్థ, న్యాయ విద్య ప్రాధాన్యతను మరచిపోతున్నామన్నారు. నేటికీ సమాజంలో న్యాయవ్యవస్థ పట్ల సరైన అవగాహన లేదన్నారు.

ముఖ్యంగా కోర్టుకు వస్తే అర్ధం‌కాని భాషతో సామాన్యుడు ఇబ్బంది పెట్టకూడదన్న చీఫ్ జస్టిస్.. అన్నీ వర్గాల వారికి అర్ధమయ్యే రీతిలో ఉంటేనే న్యాయస్థానం పట్ల గౌరవం పెరుగుతుందన్నారు. కోర్టు భవనాలు, మౌలిక సదుపాయాలను జాతీయ స్థాయిలో పెంచాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుతం మన దేశంలో కోర్టుల్లో 4.60కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కేసుల విచారణ సాగుతూ ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రభుత్వం, కార్యనిర్వాహక వర్గం చట్ట పరిధిలో‌ పని చేస్తే కోర్టుకు రానవసరం‌లేదన్నారు. పరిధి దాటితే… కోర్టులు జోక్యం చేసుకుంటాయని ఎన్వీ రమణ గుర్తు చేశారు. పౌర హక్కుల ఉల్లంఘన జరిగినా… ప్రశ్నించే తత్వం ప్రజల్లో రావల్సిన అవసరముందన్నారు. కోర్టుకు వచ్చిన ప్రతి ఒక్కిరికి న్యాయం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల నియామకాలు, ఇతర ఇబ్బందులను కోర్టులు ఎదుర్కొంటున్నాయన్నారు. బెజవాడ బ్లేజ్ వాడ అంటే… సైద్దాంతిక సిద్దాంతాల వల్లే. ఎంతో చైతన్య వంతమైన ప్రాంతం విజయవాడ. 1983 నుంచి విజయవాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ఎన్వీ రమణ తెలిపారు. అన్ని రంగాల్లో ఈ నగరం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని ఎన్వీ రమణ తెలిపారు. సాంస్కృతిక, సాహిత్య రంగాలకు వేదిక విజయవాడ. నేడు అవన్నీ కనుమరుగై పోతున్నాయి. తెలుగుభాషను శిధిలం కాకుండా చూసుకోవాలి. ఇంగ్లీషు భాష నేర్చుకోండి… కానీ మాతృభాషతోనే అక్షరాలు దిద్దండి. మాతృభాషతోనే పునాది పటిష్ఠంగా ఉంటుంది. తెలుగు భాష, తెలుగు జాతి గొప్ప తనాన్ని అందరకీ తెలియ చేయండి. ఇదే నేను ప్రజలకు ఇచ్చే సందేశంగా స్వీకరించండి.’’ అని ఎన్వీ రమణ సూచించారు.