Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఒకేసారి పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం కిలో రూ.260 వరకు పలకగా.. ఇప్పుడు రూ.300కి చేరుకుంది. దీంతో నాన్ వెజ్ ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ధరలు పెరగడానికి కోళ్ల ఉత్పత్తి లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఒకేసారి పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
Chicken Price Hike 2026

Updated on: Mar 06, 2026 | 6:57 AM

నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం వల్ల వీటి ధరలు ఆమాంతం పడిపోయాయి. బర్డ్ ప్లూ వల్ల చికెన్ తినేందుకు చాలామంది ప్రజలు ఆసక్తి చూపలేదు. చికెన్ కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ధరలు పతనమయ్యాయి. ఇప్పుడు బర్డ్ ప్లూ ప్రభావం కాస్త తగ్గడంతో చికెన్ ధరలు మళ్లీ భగ్గుముంటున్నాయి. దీంతో సామన్యులకు షాక్ తగులుతోంది. మొన్నటివరకు కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.260 వరకు పలకగా.. ఇప్పుడు ఒకేసారి రూ.300కి చేరుకుంది. పలు ప్రాంతాల్లో రూ.310కి కూడా చేరుకుంది. ధరలు ఒకేసారి పెరగడంతో కొనుగోలుదారులపై భారం పెరుగుతోంది.

ధరల పెరుగుదలకు కారణమేంటి..?

ఇటీవల బర్డ్ ఫ్లూతో పాటు పాల్ట్రీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల కారణంగా కోళ్ల పెంపకం భారీగా తగ్గింది. దీని వల్ల కోళ్లకు కొరత ఏర్పడటంతో పాటు ఉత్పత్తి తగ్గింది. మార్కెట్‌లో కోళ్లకు డిమాండ్ ఏర్పడగా.. దానికి తగ్గట్లు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు పాల్ట్రీ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఏపీకి ఒడిశా నుంచి ఎక్కువగా కోళ్లు దిగుమతి అవుతూ ఉంటాయి. కానీ ఆ రాష్ట్రంలో కూడా కోళ్ల ధరలు పెరిగాయి. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుంచి కోళ్లను తీసుకొస్తున్నారు. డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

చికెన్ ధరలు ఒకేసారి పెరుగుదల

కొద్ది రోజుల క్రితం కిలో లైవ్ బ్రాయిలర్ కోడి రూ.128గా ఉండగా.. కిలో చికెన్ రూ.200కిపైగా ఉండేది. ప్రస్తుతం లైవ్ కోడి రూ.167గా ఉండగా.. డ్రస్‌డ్ చికెన్ రూ.280 నుంచి రూ.290 వద్ద ఉంది. ఇక స్కిన్ లెస్ చికెన్ రూ.300 నుంచి రూ.310 వరకు ఉంటుంది. అటు కోడిగుడ్ల ధరలు మాత్రం భిన్నంగా కొనసాగుతున్నాయి. గుడ్ల ధరలు ఒకేసారి తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో మన దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీని వల్ల గుడ్ల నిల్వలు పెరగడంతో ధరలు తగ్గాయి. స్ధానిక మార్కెట్లలో ఒక్కో కోడి గుడ్డు ధర రూ.3.50కే పలుకుతోంది. ఇక నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ.4.30గా నిర్ణయించింది. దేశం నుంచి మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో పాల్ట్రీ రంగానికి రోజుకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది.

Follow Us