
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేలా ఎన్డీయే కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే సీట్ల పంపకాలు, అభ్యర్ధుల ప్రకటన తుది దశకు చేరుకోవడంతో.. ఇక ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు నేతలు. గత ఏడాదిన్నర కాలంగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లోనే ఉన్నారు చంద్రబాబు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఆ తర్వాత గతేడాది రాజమండ్రిలో జరిగిన మహానాడులో మినీ మేనిఫెస్టోను రిలీజ్ చేసారు. సూపర్ సిక్స్ పేరుతో మహిళలు, యువత, రైతులకు హామీలు ఇచ్చేలా మినీ మేనిఫెస్టోను రూపొందించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. నియోజకవర్గాల వారీగా టీడీపీ కేడర్ ఇంటింటికీ ఈ ప్రచారం చేసింది. ఆ తర్వాత ఇవే హామీలను బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసారు. ఇలా సుమారు ఏడాదిన్నరగా తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రజల్లోనే ఉండేలా కార్యక్రమాలు నిర్వహించింది. తాజాగా ఎన్నికల ప్రచారం కోసం సమాయత్తమవుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిన తర్వాత ప్రజాగళం పేరుతో మొదటి బహిరంగ సభను భారీగా నిర్వహించారు. చిలకలూరిపేట సమీపంలో జరిగిన ఈ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంతో ఎన్డీయే పార్టీల్లో మరింత జోష్ పెరిగింది. అయితే ఇటీవల కాలంలో సీట్ల సర్ధుబాటులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి బయటపడటంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమి పార్టీలో నేతల మధ్య విభేదాలు లేకుండా కలిసి పనిచేసేలా మూడు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు వారి అభ్యర్ధులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక రేపటి నుంచి ప్రజాగళం కార్యక్రమం ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నారు చంద్రబాబు. 160 నియోజకవర్గాల్లో పర్యటించేలా ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నారు.
రేపటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఎన్నికలకు మరో 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు చంద్రబాబు. ఇటీవల విజయవాడలో టీడీపీ అభ్యర్ధులకు నిర్వహించిన వర్క్ షాప్‌లో సీట్ల టార్గెట్ కూడా పెట్టారు. మొత్తం 160 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా నేతలందరూ కష్టపడాలని సూచించారు. దానికి తగ్గట్టుగానే మొత్తం 160 నియోజకవర్గాల్లో తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కూడా చంద్రబాబు తెలిపారు. దీంట్లో భాగంగా ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకూ క్యాంపెయిన్ షెడ్యూల్‌ను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ప్రతిరోజూ మూడు లేదా నాలుగు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొనేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు. మధ్యలో ఎన్డీయే కూటమి తరపున మూడు పార్టీల నేతలు పాల్గొనేలా భారీ బహిరంగ సభలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ బహిరంగ సభల్లో మినీ మేనిఫెస్టో, ప్రభుత్వ వైఫల్యాలతో పాటు స్థానిక ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే లేదా ఎంపీ అభ్యర్ధులు టార్గెట్‌గా సభలు కొనసాగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
చంద్రబాబు జిల్లాల పర్యటనలకు ముందుగా రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇక వరుస సభలతో ప్రచారం హోరెత్తించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈనెల 27 వ తేదీన పలమనేరు, నగరి, మదనపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళం సభలు జరగనున్నాయి. ఈనెల 28న రాప్తాడు, సింగనమల, కదిరిలో.. ఈనెల 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులోనూ.. ఈనెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం సాగనుంది. ఈ నెల 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులలో చంద్రబాబు బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు. చంద్రబాబు సభల కోసం ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.