
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి అందరినీ కలుపుకునిపోవడంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంపై వరుసగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు పురంధేశ్వరి. బాధ్యతలు చేపట్టిన రోజే వరుసగా ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాతో మాట్లాడారు.. పురంధేశ్వరి కంటే ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పనిచేసిన సమయంలో అధికార పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీపైన విమర్శలు చేసేవారు. కానీ పురందేశ్వరి మొదటి నుంచీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించారని ఏకంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత మద్యం కుంభకోణం, ఇసుక ఆకమాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తున్నదంటూ కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం పై దూకుడుగా ముందుకెళ్తున్నారు. కానీ పార్టీ కార్యక్రమాలపై పెద్దగా దృష్టి సారించలేదు. అయితే ఇటీవల చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ లో ముసలం పుట్టినట్లు తెలుస్తుంది. తమ అధ్యక్షురాలు పార్టీ బలోపేతానికి కాకుండా చంద్రబాబు కు పరోక్షంగా సహకరిస్తున్నారని కొంత మంది నేతకు గుర్రుగా ఉన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై సుప్రీంకోర్టు సీజేకు పురందేశ్వరి లేఖ రాయడంతో బీజేపీ నేతలు బాహాటంగా ఆరోపణలకు దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు బయటపడినట్లైంది.
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ప్రక్షాళన చేపట్టారు. సోము వీర్రాజు వర్గంగా ఉన్న నాయకులను పక్కన పెట్టారని అప్పట్లో దుమారం రేగింది. అయినా వివాదం పెద్దది కాకుండా అందరికి సర్ది చెప్పుకుంటూ పార్టీని గాడిలో పెట్టె ప్రయత్నం చేశారు పురందేశ్వరి. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ అమిత్ షా వద్దకు వెళ్ళినప్పుడు పురందేశ్వరి కూడా అక్కడే ఉండటంతో పాటు ప్రభుత్వం పై వరుసగా చేస్తున్న ఆరోపణలతో వ్యతిరేక వర్గం రకరకాల ప్రచారం చేస్తోంది. ఒకవైపు పురందేశ్వరి పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ లతో తీవ్ర ఆరోపణలు చేస్తుండగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి మరింత తీవ్రంగా పురందేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు.
అసలు పురందేశ్వరి బీజేపీ కోసం కాకుండా తన మరిది చంద్రబాబు కోసం, టీడీపీని కాపాడటానికి పని చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు. సొంత పార్టీలో కీలక నాయకుడు ఇలాంటి ఆరోపణలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. స్వప్రయోజనాల కోసం పురందేశ్వరి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పొత్తులో భాగంగా ఎంపీగా పోటీ చేయాలని ఆశతో పురందేశ్వరి ఉన్నట్లు సుబ్బారెడ్డి ఆరోపించారు. అంతేకాదు జనసేనను టీడీపీతో పొత్తు పెట్టుకునేలా కూడా పురందేశ్వరి సహకరించినట్లు ఆరోపణ చేశారు.
సాక్షాత్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిపై కార్యవర్గ సభ్యుడు సుబ్బారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేయడంతో బీజేపీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది అయితే సుబ్బారెడ్డి తో పాటు మరికొంతమంది నేతలు కూడా పురందేశ్వరి వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా ఎవరినీ మాట్లాడకుండా పురందేశ్వరి అడ్డుకుంటున్నారని కూడా సుబ్బారెడ్డి చేసిన ప్రధానమైన ఆరోపణ. సుబ్బారెడ్డి ఆరోపణలతో బీజేపీలో ఉన్న వర్గ విభేదాలు బయటికి వచ్చినట్లైంది. అయితే పురందేశ్వరి మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని ఆమె స్వయంగా తెలిపారు.
రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర అధినాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తక్కువ కాలంలోనే ఆమెపై తీవ్ర ఆరోపణలు రావడం వెనుక కొంతమంది కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా చెప్పుకొస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. టీడీపీతో పురందేశ్వరికి ఎలాంటి సంబంధం లేదని కూడా పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దలకు ఏపీ వ్యవహారాలపై నిత్యం సమాచారం ఇస్తున్నారట పురందేశ్వరి. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగానే పురందేశ్వరి ముందుకెళ్తున్నారని అంటున్నారు కొందరు బీజేపీ సీనియర్ నేతలు. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్, కేసుల వ్యవహారం పురందేశ్వరి తో పాటు బీజీపీకి తలనొప్పిగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..