Andhra Pradesh: కుప్పం పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాళ్ల బూదుగురు రోడ్ షోలో బీజేపీ హైకమాండ్‌ను నిలదీశారు. విశాఖ టూర్‌లో అమిత్‌షా, శ్రీకాళహస్తి జేపీ నడ్డా.. వైసీపీ సర్కార్ పై అవినీతి ఆరోపణలు చేయడం వరకు ఓకే కాని.. ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని ప్రశ్నించారు చంద్రబాబు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన వైసీపీని.. జగన్ అంతా అవినీతి పరుడు ప్రపంచంలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు. ప్రజలనుంచి వైసీపీ దోచుకున్న ప్రతి రూపాయి వెనక్కి రప్పించే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుందని హామీ ఇచ్చారు బాబు.
టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి తప్పా.. ఈ నాలుగేళ్లలో ఏదైనా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు బాబు. కుప్పంకు హంద్రీ నీవా నుంచి నీళ్లు తీసుకొస్తే.. గడిచిన నాలుగేళ్లో ఒక్క పని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పులివెందులకు నీళ్ళు ఇచ్చిన ఘనత టిడిపిది అయితే… కుప్పంపై కక్ష కట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందంటూ సెటైర్లు వేశారు. కుప్పం నియోజకవర్గాన్ని దోపిడీ చేస్తున్న చోటా మోట పేటీఎం వైసీపీ దొంగలను తరిమి తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు చంద్రబాబు.
కాగా, మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మొదటి రోజు నియోజకవర్గంలోని రాళ్ల బూదుగురులో రోడ్ షో నిర్వహించారు చంద్రబాబు. ఇవ్వాళ, రేపు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. రానున్న శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో.. పార్టీ పూర్తిస్థాయి పటిష్ఠత లక్ష్యంగా నిర్వహించనున్న సమావేశాలు.. సమీక్షల్లో పార్టీ శ్రేణులకు అధినేత చంద్రబాబు దిశా నిర్థేశం చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..