
ఇకనైనా ఇవ్వకపోతారా? అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ఏపీకి ప్రత్యేక హోదా లేనట్లేనని మరోసారి పరోక్షంగా స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. 14, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా సహా ఏపీకి సంబంధించిన పలు అంశాలను టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. వివిధ అంశాలపై ప్రశ్నల రూపంలో కేంద్ర ప్రభుత్వం ముందు ప్రస్తావించారు. విజభన కారణంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని, ఆ నష్టాన్ని పూరించేందుకు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని లోక్‌సభలో ఎంపీ కేశినేని ప్రశ్నించారు. ఈ విషయమై సంబంధిత అధికార వర్గాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా సమావేశాలు నిర్వహించారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారాయన.
ఇక రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. విజభన చట్టంలోని హామీల అమలు గురించి ప్రస్తావించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఏమైనా వచ్చిందా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేందుకు కేంద్ర సాయం అందిస్తోందా అని అడిగారు. ఆ నిధుల వివరాలు తెలియజేయాలని కోరారు.
ఎంపీల ప్రశ్నలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. 14వ ఆర్థిక సంఘం జనరల్ కేటగిరీ రాష్ర్టాలు, ప్రత్యేక హోదా రాష్ర్టాల మధ్య పన్నుల పంపిణీకి ఎలాంటి వ్యత్యాసం చూపలేదని స్పష్టం చేసింది. 14 వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు 2015, 2020 మధ్య పన్నుల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచిందని గుర్తు చేశారు. ఆ తరువాత 15వ ఆర్థిక సంఘం కూడా 41శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందన్నారు. నిధుల పంపిణీ ద్వారా వీలైనంత మేరకు ప్రతి రాష్ర్టానికి వనరులు అందించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..