Central Parliamentary: కేంద్ర ప్రభుత్వం నిధులతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని పార్లమెంటరీ బృందం సభ్యులు ఈనెల 16వ తేదీన చిత్తూరు జిల్లాకు రానున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. 31 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి ప్రతాప్‌రావు జావేద్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ బృందం స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. 16న ఉదయం 10 గంటలకు కేంద్రం బృందం సభ్యులు తిరుపతి నుంచి బయలుదేరి 11 గంటలకు పులిచెర్ల మండలం దిగువపోకలవారిపల్లెకు చేరుకుంటారు.
సుమారు అరగంట పాటు అక్కడే ఉండి పీఎంకేఎస్ వై కింద చేపట్టిన వాటర్ షెడ్ పనులను పరిశీలిస్తారు. 11.30 గంటలకు సువారపుపల్లెలో చేపట్టిన ఉపాధి పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 12 గంటలకు మతకువారిపల్లెలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలను బృందం సభ్యులు పరిశీలిస్తారు. అలాగే 12.30 గంటలకు కల్లూరు ఉన్నత పాఠశాల ఆవరణలో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి నిర్వహిస్తారు. 1.30 గంటలకు కల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును, స్థానిక ఇందిరానగర్‌లో జలజీవన్ మిషన్ కింద నిర్మించిన వాటర్ ట్యాంకును బృందం సభ్యులు పరిశీలిస్తారు.