Viveka Murder Case: ఎంపీ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలంటూ..

|

May 20, 2023 | 12:08 PM

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. సోమవారం (మే22)న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.

Viveka Murder Case: ఎంపీ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు.. ఆ రోజున విచారణకు రావాలంటూ..
Avinash Reddy
Follow us on

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం (మే22)న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. కాగా నిజానికి శుక్రవారం (మే19) అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు కూడా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. అంతేకాదు వెంటనే కారులో పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు. అయితే తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, అవినాశ్ రెడ్డి తన కాన్వాయ్ ని వెనక్కి తిప్పారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్‌ కూడా కర్నూలులోనే ఉన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న సీబీఐ బృందాలు నిన్న కర్నూల్‌కు వెళ్లాయి. అయితే సాయంత్రమే తిరిగి వచ్చాయి. ఈక్రమంలో మరోసారి విచారణకు హాజరుకావాలంటూ వాట్సప్‌ ద్వారా అవినాష్‌ రెడ్డికి నోటీసులు పంపించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు సీబీఐ అధికారులు.

వస్తారా? గడువు కోరతారా?

కాగా వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ నెల 16నే అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశాడు. నాలుగు రోజుల సమయం కావాలని ఆయన కోరారు. దీంతో 19న విచారణకు రావాలని సీబీఐ మరో నోటీసు పంపింది. అయితే నిన్న కూడా విచారణకు రాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మరి ఇప్పటికే రెండుసార్లు విచారణకు గైర్హాజరైన అవినాష్‌ .. ఈసారైనా విచారణకు వస్తారా? లేదా మరోసారి గడువు కోరతారా? అన్నది ఉత్కంఠగా మారింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..