గన్నవరం, డిసెంబర్ 6: ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధి ఎయిర్ పోర్టులో అనుమానా స్పదంగా కనిపించాడు. అతడి లగేజీ చెక్ చేయగా.. రెండు బుల్లెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో వెలుగు చూసింది. వెంటే సిబ్బంది సదరు విద్యార్ధిని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. గన్నవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హర్యానాలోని పానిపట్‌కు చెందిన ఆర్య యువకుడు గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వస్థలం నుంచి గత జులై నెలలో యూనివర్సిటీకి వచ్చాడు. గురువారం ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థి విజయవాడ మీదగా ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆర్య లగేజీ తనిఖీ చేశారు. అయితే అతడి లగేజీలో రెండు రౌండ్ల మందుగుండు సామాగ్రి (తుపాకీ బుల్లెట్లు) ఉన్నట్లు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు విమానాశ్రయ భద్రతాధికారి ఎస్సై జీఎన్ స్వామి తెలిపారు.
పట్టుబడిన యువకుడి తండ్రి రోహతస్ హరియాణాలో ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. రోహతస్‌కు గన్ లైసెన్స్, నామినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు కూడా ఉన్నాయి. అయితే స్వస్థలం నుంచి గుంటూరుకు రైలు మార్గంలో వచ్చానని, ఇంటి నుంచి వచ్చే సమయంలో తన తండ్రి సామగ్రి ఉన్న బ్యాగ్‌ను పొరబాటున తీసుకొని రావడం వల్లనే ఇలా జరిగి ఉంటుందని, అసలు అవి తన లగేజీలోకి ఎలా వచ్చాయో తనకు తెలియదని ఆర్య పోలీసులకు తెలిపాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న బుల్లెట్లు ఆర్య తండ్రి లైసెన్స్ తుపాకీకి చెందినవని, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.